అమెరికా నుంచి వెనక్కి వచ్చేస్తున్న టెకీలు.. 2026లో బయటపడిన షాకింగ్ లెక్కలివే!
అమెరికా కల అంటే ఒకప్పుడు జీవితానికి భరోసా. వీసా చేతిలో పడితే చాలు, సగం జీవితం గెలిచేసినట్లే అనుకునేవారు. ఏళ్ల తరబడి డాలర్ల జీతం, విలాసవంతమైన కార్లు, ఆకట్టుకునే లైఫ్‌స్టైల్ కోసం రాత్రింబవళ్లు కష్టపడేవారు. కానీ ఇప్పుడు కాలం వేగంగా మారుతోంది!
అమెరికాలో ఉద్యోగం ఎంత బాగున్నా, అది రేపు పొద్దుటికి ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వీసా ఉందనే ధైర్యం కూడా ఎంతో కాలం నిలవడం లేదు. అందుకే ఒకప్పుడు అక్కడే శాశ్వతంగా సెటిల్ అయిపోవాలని కలలు కనిన మన భారతీయ టెకీలు, ఇప్పుడు మెల్లగా సూట్‌కేసులు సర్దుకుని స్వదేశం బాట పడుతున్నారు. 2026లో బయటపడుతున్న లెక్కలు చూస్తుంటే అసలు అక్కడ ఏం జరుగుతోందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
తొమ్మిది నెలల్లోనే ఇన్ని వేల మందా?
ఈ మార్పు ఏదో కొద్దిమందికి మాత్రమే పరిమితం కాలేదని గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. 2026 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలోనే దాదాపు 12,700 మంది భారతీయ వైట్ కాలర్ ఉద్యోగులు అమెరికా వదిలి భారత్‌కు తిరిగి వచ్చినట్లు ఒక నివేదిక పేర్కొంది.
గతేడాది మొత్తం మీద ఈ సంఖ్య 15,100గా ఉంటే, ఈ ఏడాది ముగియడానికంటే ముందే దాదాపు 84 శాతం మార్కును చేరుకోవడం గమనార్హం. ఇదే ధోరణి కొనసాగితే ఈ ఏడాది తిరిగొచ్చిన వారి సంఖ్యలో కొత్త రికార్డులు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ అసలు విచిత్రం ఏంటంటే, వీరంతా ఉద్యోగాలు దొరకక వెనక్కి వస్తున్నవారు కారు. మంచి విద్యార్హతలు, ఉన్నతమైన నైపుణ్యాలు ఉండి కూడా అక్కడ కొనసాగడం కంటే సొంత ఊరికి వెళ్లడమే నయమని భావిస్తున్నారు.
రేపటి రోజుపై లేని భరోసా!
టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లు కొత్త కాకపోయినా, ఈసారి పరిస్థితి కాస్త తీవ్రంగా ఉంది. విదేశాల్లో ఉన్నప్పుడు ఉద్యోగం పోవడం అంటే కేవలం నెలాఖరున జీతం రాకపోవడం మాత్రమే కాదు, అక్కడితో మొత్తం జీవితమే తలకిందులైపోతుంది. ఉద్యోగం పోయిన వెంటనే వీసా నిబంధనలకు అనుగుణంగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి రావడం, గడువులోగా మారకపోతే దేశం విడిచి వెళ్లాల్సి రావడం పెద్ద ప్రహసనంగా మారుతోంది.
అమెరికాలో మంచి ఇల్లు, పిల్లల చదువులు, విలాసవంతమైన జీవనం అన్నీ ఉన్నప్పటికీ, ఉన్నట్టుండి ఉద్యోగం ఊడితే ఏం చేయాలనే భయం టెకీలను వెంటాడుతోంది. ప్రతిరోజూ నిద్రాహారాలు మాని ఆందోళనతో గడపడం కంటే, స్వదేశానికి వచ్చి ప్రశాంతంగా జీవించడం మేలనే ఆలోచన వీరిలో బలపడుతోంది.
ఇవి కూడా చదవండి
వలస విధానాల దెబ్బ, పెరుగుతున్న నిరాశ
ట్రంప్ ప్రభుత్వ హయాంలో తీసుకొస్తున్న కఠినమైన వలస విధానాలు, వీసా నిబంధనలు కూడా ఈ ఆందోళనను మరింత పెంచుతున్నాయి. గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల తరబడి నిరీక్షించాల్సి రావడం, దానికితోడు ఎప్పుడు ఏ కొత్త నిబంధన వచ్చి పడుతుందో తెలియకపోవడంతో చాలామంది తమ భవిష్యత్తు ప్రణాళికలను మార్చుకుంటున్నారు.
ఎంత కష్టపడి కెరీర్‌ను నిర్మించుకున్నా శాశ్వత నివాసానికి భరోసా లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అయితే కేవలం రాజకీయ, వలస విధానాల వల్లే కాకుండా వ్యక్తిగత, కుటుంబ అవసరాల వల్ల కూడా చాలామంది సొంత దేశానికి రావాలని నిర్ణయించుకుంటున్నారు.
భారత్‌కు రావడం సులువేనా?
అయితే అమెరికా వదిలేసి భారత్‌కు రాగానే ఇక్కడ పూల బాటలు స్వాగతం పలుకుతాయని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! భారత ఐటీ రంగం కూడా ఇప్పుడు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి.
దీనివల్ల సంప్రదాయ ఐటీ ఉద్యోగాలు తగ్గిపోయి కొత్త టెక్నాలజీ తెలిసినవారికే డిమాండ్ పెరుగుతోంది. అమెరికాలో కోట్ల రూపాయల ప్యాకేజీలు తీసుకున్నవారికి భారత్‌లో సరిసమానమైన జీతాలు లభించడం తేలికేమీ కాదు. కాబట్టి ఇక్కడికి వచ్చేముందు కెరీర్ అవకాశాలు, జీతాల విషయంలో కొన్ని రాజీలకు సిద్ధపడాల్సి వస్తోంది.
డాలర్ల కంటే కుటుంబమే మిన్న!
ఇవన్నీ ఒకెత్తయితే, సొంత ఇంటికి తిరిగి రావడానికి ప్రధాన కారణం కుటుంబం. డాలర్లలో ఎంత సంపాదించినా, వయసు మళ్లుతున్న తల్లిదండ్రులకు దూరంగా ఉండటం, పండుగలకు, శుభకార్యాలకు రాలేకపోవడం చాలామందిని వేధిస్తున్న సమస్య. ఉద్యోగంలో అభద్రతా భావం పెరిగినప్పుడు కుటుంబంతో గడిపే సమయం ఎంత
—సూర్య ప్రకాష్ జోశ్యుల








