Truecaller కు భారీ షాక్.. రూ.750 కోట్ల పన్ను డిమాండ్? అసలు వివాదం ఏంటి?
మనకు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చే యాప్ Truecaller. స్పామ్ కాల్స్, మార్కెటింగ్ ఫోన్లు, మోసపూరిత కాల్స్‌ను గుర్తించేందుకు కూడా ఈ యాప్‌ను ఉపయోగిస్తుంటారు. స్వీడన్‌కు చెందిన ఈ యాప్‌కు భారత్‌లో ఎంతటి ఆదరణ ఉందంటే.. 2026లో కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 కోట్లకు పైగా నెలవారీ యూజర్లలో 35 కోట్ల మందికి పైగా భారతీయులే. అంటే, ప్రపంచవ్యాప్తంగా Truecallerను ఉపయోగించే ప్రతి పది మందిలో దాదాపు ఏడుగురు భారత్‌లోనే ఉన్నారు.
ఇంతటి భారీ యూజర్ బేస్ ఉన్న Truecallerకు ఇప్పుడు భారత్‌లో పన్ను వివాదం ఎదురైంది. భారత పన్ను అధికారులు తమపై వడ్డీతో కలిపి దాదాపు 900 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు (సుమారు 9.085 కోట్ల డాలర్లు) పన్ను డిమాండ్ చేసే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. భారత రూపాయల్లో ఇది సుమారు రూ.750 కోట్లకు పైమాటే. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? Truecaller అంత మొత్తం పన్ను చెల్లించాల్సి వస్తుందా?
భారత్‌లో అత్యధికంగా ఉపయోగించే కాలర్ ఐడీ యాప్స్‌లో ఒకటైన Truecallerకు ఇది కీలక పరిణామం. ఎందుకంటే, కంపెనీ మొత్తం ఆదాయంలో దాదాపు 75 శాతం భారత మార్కెట్ నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో పన్ను వివాదం కంపెనీ ఆర్థిక పరిస్థితిపైనా, భారత్‌లో దాని వ్యాపారంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
అసలు వివాదం దేనిపై?
ఈ కేసులో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ (Transfer Pricing). ఒకే కంపెనీ గ్రూపులోని వేర్వేరు సంస్థలు ఒకదానితో మరొకటి జరిపే లావాదేవీలకు ఎంత ధర నిర్ణయించాలి? అలాగే, వివిధ దేశాల్లోని ఆ సంస్థల మధ్య ఆదాయం, లాభాలను ఎలా పంచాలి? అనే అంశాలనే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటారు.
ఉదాహరణకు, ఒక అంతర్జాతీయ సంస్థకు భారత్‌లో ఒక కంపెనీ, స్వీడన్లో మరో కంపెనీ ఉన్నాయనుకుందాం. భారత్‌లోని వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంలో ఏ భాగం భారత సంస్థకు చెందాలి? ఏ భాగం విదేశీ సంస్థకు చెందాలి? అనే విషయంలో పన్ను అధికారులు, కంపెనీ మధ్య అభిప్రాయ భేదాలు వస్తూంటాయి.
ఇవి కూడా చదవండి
Truecaller విషయంలోనూ ఇదే తరహా వివాదం తలెత్తింది. కంపెనీ గ్రూపులోని వివిధ సంస్థల మధ్య ఆదాయాన్ని కేటాయించిన విధానాన్ని భారత పన్ను అధికారులు ప్రశ్నించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి అధికారిక ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఉత్తర్వు జారీ చేశారు. ఇందులో అదనపు పన్ను, వడ్డీ కలిపి 270 మిలియన్ స్వీడిష్ క్రోనర్ల మేర సర్దుబాటును ప్రతిపాదించినట్లు కంపెనీ తెలిపింది.
అంతేకాదు, 2018-19 నుంచి 2023-24 వరకు ఉన్న ఆర్థిక సంవత్సరాల్లోనూ ఇలాంటి సర్దుబాట్లు జరిగే అవకాశం ఉందని Truecaller అంచనా వేస్తోంది. ఈ అన్ని సంవత్సరాలను కలిపి చూస్తే మొత్తం పన్ను బాధ్యత సుమారు 900 మిలియన్ క్రోనర్లకు చేరవచ్చని పేర్కొంది.
రూ.750 కోట్లు మొత్తం చెల్లించాల్సిందేనా?
Truecaller అంచనా ప్రకారం, స్వీడన్లో డబుల్ టాక్సేషన్ రిలీఫ్ (రెండుసార్లు పన్ను చెల్లించకుండా ఉపశమనం) ద్వారా సుమారు 350 మిలియన్ స్వీడిష్ క్రోనర్లను తిరిగి పొందే అవకాశం ఉంది. ఇది లభిస్తే, కంపెనీపై పడే నికర ఆర్థిక భారం సుమారు 550 మిలియన్ క్రోనర్లకు తగ్గవచ్చని అంచనా.
అయితే, ఈ ఉపశమనం లభిస్తుందా? ఎంత మొత్తం వర్తిస్తుంది? అనే అంశాలు సంబంధిత పన్ను నిబంధనలు, అధికారుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.
పన్ను అధికారుల వాదనను Truecaller అంగీకరిస్తుందా?
భారత పన్ను అధికారుల అభిప్రాయాలతో Truecaller ఏకీభవించడం లేదు. తమ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ విధానం అంతర్జాతీయంగా ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగానే ఉందని కంపెనీ చెబుతోంది.
సంబంధిత లావాదేవీల్లో స్వతంత్ర సంస్థల మధ్య జరిగే లావాదేవీలకు వర్తించే ధరల సూత్రం (Arm’s Length Principle) పాటించామని, తమ విధానాన్ని బాహ్య నిపుణులు కూడా పరిశీలించారని పేర్కొంది.
అందువల్ల, పన్ను అధికారుల ఉత్తర్వులను భారత పన్ను ట్రిబ్యునళ్లు, న్యాయస్థానాల్లో సవాలు చేయాలని Truecaller నిర్ణయించింది. తమపై వచ్చిన ఆరోపణలను కంపెనీ నిరాధారమైనవిగా అభివర్ణించింది.
భారత్ ఎందుకు కీలకం?
Truecallerకు భారత్ కేవలం మరో మార్కెట్ మాత్రమే కాదు. కంపెనీ ఆదాయంలో దాదాపు మూడు వంతులు ఇక్కడి నుంచే వస్తున్నాయని తెలిపింది. అందుకే ఈ పన్ను వివాదం ప్రాధాన్యం సంతరించుకుంది.
దాదాపు రెండేళ్ల క్రితం కూడా భారత పన్ను అధికారులు కంపెనీ భారత కార్యాలయాలను సందర్శించారు. అది సాధారణ పన్ను తనిఖీలో భాగమేనని, తాము అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని అప్పట్లో Truecaller తెలిపింది.
అంతర్జాతీయంగా వ్యాపారం చేసే సంస్థలు తమ లాభాలను వివిధ దేశాల్లోని అనుబంధ కంపెనీల మధ్య ఎలా పంచుకుంటున్నాయన్న అంశంపై భారత పన్ను అధికారులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీనికి కారణం, ఒక సంస్థ తన కార్యకలాపాలు భారత్‌లో నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ ఎంత ఆదాయం, లాభం పన్ను పరిధిలోకి రావాలన్నది నిర్ధారించడం.
Truecaller కేసులోనూ ఇదే అంశం కీలకంగా మారింది. చివరకు పన్ను అధికారులు ఎంత మొత్తాన్ని ఖరారు చేస్తారు? కంపెనీ న్యాయపోరాటంలో ఎలాంటి ఫలితం వస్తుంది? అన్నది తదుపరి పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








