మంగళగిరిలో వైసీపీకి షాక్ ఇచ్చిన లోకేష్..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన పలువురు సీనియర్ నాయకులు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో వీరంతా అధికార తెలుగుదేశం పార్టీ (tdp) తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని మంత్రి నివాసంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కీలక లీడర్లు తమ అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి పసుపు కండువా కప్పుకున్నారు.
స్థానికంగా బలమైన కేడర్ ఉన్న నేతలు ఇలా ఒకేసారి పార్టీ మారడం మంగళగిరిలో వైసీపీ ఉనికిని మరింత ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ భారీ చేరికల్లో భాగంగా గుంటూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంగళగిరి పట్టణ సీనియర్ నేత దామర్ల కుబేరస్వామి తన అనుచరవర్గంతో కలిసి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు మంగళగిరి ప్రాంతంలో చురుకైన రాజకీయాలు నడుపుతున్న వైసీపీ సీనియర్ నేత తోలేటి రవీంద్ర, అలాగే దుగ్గిరాల మండలానికి చెందిన మరో కీలక నేత షేక్ అబ్దుల్ సలాం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి సైకిల్ ఎక్కారు.
నామినేషన్ల వేళ ఈ ముగ్గురు సీనియర్ నేతలు ఒక్కసారిగా తమ వర్గాలతో సహా తరలిరావడంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీలోకి వచ్చిన నేతలకు మంత్రి నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కొత్తగా పార్టీలో చేరిన నాయకులతో మాట్లాడి వారికి పార్టీలో సముచిత స్థానం, రాజకీయ భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేసే ప్రతీ ఒక్కరినీ తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ అరాచకాలను, విఫల విధానాలను చూసి విసిగిపోయినందు వల్లే వివిధ పార్టీల నుంచి, ముఖ్యంగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు స్వచ్ఛందంగా టీడీపీలోకి వస్తున్నారని స్థానిక తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.








