‘జైలర్ 2’ కలెక్షన్లతో మొదలైన రచ్చ.. మధ్యలోకి రామ్ చరణ్‌ను ఎందుకు లాగారు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
సినిమా అభిమానుల మధ్య గొడవలు ఎప్పుడూ ఉన్నాయి. అయితే వాటిని తమ హీరోల సినిమాలతో పోలుస్తూ ఎంజాయ్ చేసే స్దాయి దాటి ఒక టైమ్ లో సినిమా పోస్టర్లు చించుకుంటూ, హోర్డింగ్ లు పెట్టడంలో పోటీలు పడేదాకా వెళ్లింది. అయితే ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియాదే రాజ్యం. చేతిలో సెల్ ఫోన్ తోనే యాంటీ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. వీథిలోకి వెళ్లకుండానే పెద్ద పెద్ద యుద్దాలు చేస్తున్నారు. అయితే అవి ఆరోగ్యకరంగా ఉండి, సరదాగా ఉంటే ఇబ్బంది లేదు. అలా కాకుండా తమ హీరోని లేపటం వేరే హీరోలని, వాళ్ల సినిమాలని టార్గెట్ చేసినప్పుడే సమస్య అంతా.
తాజాగా జైలర్ 2 వసూళ్ల చుట్టూ మొదలైన చర్చ కూడా ఇదే ట్రెండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. రజనీకాంత్ అభిమానులు, చిరంజీవి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వాదోపవాదాలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారాయి.
కలెక్షన్లు ఒకరివి.. టార్గెట్ మరో హీరో!
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ 2 మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రామ్ చరణ్ పెద్ది లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటేసిందన్న ప్రచారం అభిమానుల మధ్య కొత్త వివాదానికి తెరతీసింది. ఈ క్రమంలో తమ హీరో సినిమా సాధించిన వసూళ్లను సెలబ్రేట్ చేసుకోవడంతో ఆగకుండా, ఇతర హీరోల మార్కెట్‌తో పోల్చడం మొదలైంది. రజనీకాంత్ అభిమానులు రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాను ప్రశ్నిస్తుండగా, ఈ చర్చ క్రమంగా చిరంజీవి స్టార్డమ్, మార్కెట్ పరిధి వైపు మళ్లింది.
సోషల్ మీడియాలోనే అసలు పోటీ!
హీరోల సినిమాల వసూళ్లను పోల్చడం అభిమానులకు కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు ఈ పోలికలకు సోషల్ మీడియా వేదికలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఒక సినిమా రికార్డు సాధించిందంటే వెంటనే మరో హీరో సినిమా కలెక్షన్లను తెరపైకి తీసుకురావడం, పాత రికార్డులను తవ్వడం, పోస్టర్లు-ట్రేడ్ లెక్కలతో తమ హీరో గొప్పతనాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం సాధారణంగా మారింది.
జైలర్ 2 చర్చలోనూ రజనీకాంత్ మార్కెట్, చిరంజీవి పాపులారిటీ, హిందీ ప్రేక్షకుల్లో ఆదరణ వంటి అంశాలను అభిమానులు ప్రస్తావిస్తున్నారు. చిరంజీవి సినిమాలకు ఎనిమిదేళ్ల విరామం ఇవ్వడం కూడా ఆయన బాక్సాఫీస్ మార్కెట్‌పై ప్రభావం చూపిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, చిరంజీవి తన స్టామినే నమ్ముకున్నారని, ఎస్.ఎస్. రాజమౌళి వంటి డైరెక్టర్స్ దర్శకత్వంలో అవకాశం ఉన్నా సినిమా చేయలేదని, రజనీకాంత్ మాత్రం శంకర్ దర్శకత్వంలో మూడు సినిమాల్లో నటించారని, అందుకే పెద్ద హిట్స్ కొట్టారని మరికొందరు ప్రస్తావిస్తున్నారు.
హీరోల మధ్య పోటీ కంటే.. ఫ్యాన్స్ మధ్య పోరే ఎక్కువ!
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. రజనీకాంత్, చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాల గురించి చర్చ మొదలైతే, అది చాలాసార్లు సినిమా కథ, నటన, దర్శకత్వం నుంచి పక్కకు వెళ్లిపోతోంది. ఎవరి మార్కెట్ పెద్దది? ఎవరు ఎక్కువ వసూళ్లు సాధించారు? ఎవరి రికార్డులు బలమైనవి? అనే ప్రశ్నలే ప్రధానంగా మారుతున్నాయి. ఒక హీరో విజయాన్ని మరో హీరో ఓటమిగా చూపించే ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో సినిమా వసూళ్లపై జరగాల్సిన ఆరోగ్యకరమైన చర్చ, అభిమానుల మధ్య వ్యక్తిగత విమర్శలు, ట్రోలింగ్ వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ ఫ్యాన్ వార్స్‌తో లాభం ఎవరికి?
సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరిగే ఈ యుద్ధాలు సినిమాలకు అదనపు ప్రచారం తీసుకొస్తున్నా, వాటి ప్రభావం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని చెప్పలేం. ఒకవైపు హీరోల పేర్లు ట్రెండింగ్‌లోకి వస్తాయి.
మరోవైపు, సినిమా విజయాన్ని ఆస్వాదించాల్సిన అభిమానులు ఇతర హీరోలతో పోలికల్లోనే మునిగిపోతారు. పైగా, ఓపెనింగ్స్, గ్రాస్, షేర్, లైఫ్‌టైమ్ కలెక్షన్లు వంటి వేర్వేరు లెక్కలను ఒకే విధంగా పోల్చడం వల్ల వాస్తవ పరిస్థితులపై గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.








