అమెరికా పిల్లలందరికీ మస్క్ భారీ గిఫ్ట్.. దీని వెనుక అసలు లెక్కేంటి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ప్రపంచ ప్రసిద్ధ బిలియనీర్, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అమెరికాలోని ప్రతీ చిన్నారికి తన సంస్థ స్పేస్ఎక్స్కు చెందిన ఒక్కో షేర్‌ను ఉచితంగా కానుకగా ఇస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే ఏడాదే ఈ ప్రక్రియను ప్రాంరంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
అమెరికాలో ప్రస్తుతం 18 ఏళ్లలోపు ఉన్న పిల్లల సంఖ్య సుమారు 7.3 కోట్లుగా ఉంది. వీరందరికీ ఒక్కో షేరు వంతున పంచిపెడితే, నేటి మార్కెట్ లెక్కల ప్రకారం ఈ ఆఫర్ విలువ దాదాపు 10.66 బిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో రూ.95,000 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే ఈ షేర్లను నేరుగా పిల్లల పేర్ల మీదే బదిలీ చేస్తారా లేదా దీనికి ఏమైనా ప్రత్యేక నిబంధనలు ఉంటాయా అనే విషయాలపై మస్క్ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మస్క్ ఎందుకీ ప్రకటన చేసారు!
మస్క్ హఠాత్తుగా ఈ ప్రకటన చేయడానికి వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ముందంజలో ఉన్న ఆంథ్రోపిక్ సంస్థ, తమ కంపెనీలోని 5 శాతం షేర్లను నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘పబ్లిక్ బెనిఫిట్ ఫండ్’కు కేటాయిస్తున్నట్లు ఇటీవల వెల్లడించింది. ఈ నిర్ణయంపై స్పందించిన ఎలాన్ మస్క్, సంస్థల పేరిట ఫండ్లు ఏర్పాటు చేయడం కంటే షేర్లను నేరుగా సామాన్య ప్రజలకే అందజేయడం ఎంతో మేలని అభిప్రాయపడ్డారు.
ఆ ఆలోచనతోనే అమెరికాలోని పిల్లలందరికీ స్పేస్ఎక్స్ షేర్లు ఇస్తానని సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో సాధారణ పౌరుల ప్రయోజనం కోసం ఇలాంటి మరిన్ని పథకాలను తీసుకొస్తానని కూడా ఆయన పేర్కొన్నారు.
మరి, మస్క్‌కు అసలు కలిసివచ్చేది ఏమిటి?
1. స్పేస్ఎక్స్కు కోట్లాది మంది కొత్త అభిమానులు!
అమెరికాలోని లక్షలాది కుటుంబాల పిల్లలకు స్పేస్ఎక్స్లో వాటా ఉంటే, ఆ కంపెనీ ఎదుగుదలపై వాళ్లకూ ఆసక్తి పెరుగుతుంది. కంపెనీ షేర్ ధర పెరిగితే తమ పిల్లల పెట్టుబడి విలువ పెరిగిందని తల్లిదండ్రులు భావిస్తారు. అప్పుడు స్పేస్ఎక్స్ కేవలం రాకెట్లు, ఉపగ్రహాలు ప్రయోగించే కంపెనీగానే కాకుండా, తమ కుటుంబాల ఆర్థిక భవిష్యత్తుతో ముడిపడిన సంస్థగా కనిపించవచ్చు.
ఇదే మస్క్‌కు పరోక్షంగా కలిసివచ్చే అంశం కావచ్చు. స్పేస్ఎక్స్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు, నియంత్రణలు, అంతరిక్ష రంగంపై ప్రజల అభిప్రాయాలు వంటి విషయాల్లో కంపెనీకి ప్రజల మద్దతు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే, షేర్లు పొందిన కుటుంబాలన్నీ మస్క్‌కు లేదా కంపెనీకి మద్దతుదారులుగా మారతాయని చెప్పలేం. ఈ అవకాశాన్ని కొందరు విశ్లేషకులు ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మార్చుకునే వ్యూహంగా కూడా చూస్తున్నారు.
2. రూ.95 వేల కోట్లు అంటే చేతిలోంచి అంత డబ్బు పోతుందా?
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మస్క్ ప్రకటించిన మొత్తం విలువ సుమారు రూ.95 వేల కోట్లకు పైగా ఉన్నప్పటికీ, ఆయన అంత నగదును ఖర్చు చేయబోతున్నారని అర్థం కాదు. ఆయన తన వద్ద ఉన్న స్పేస్ఎక్స్ షేర్లను బదిలీ చేస్తే, ఆ షేర్ల మార్కెట్ విలువ అంత ఉంటుందన్నమాట. అంటే నగదును పంచడానికి, కంపెనీలో తనకున్న వాటాలో కొంత భాగాన్ని ఇతరులకు ఇవ్వడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇలాంటి బహుమతుల వల్ల పన్నులకు సంబంధించిన ప్రయోజనాలు ఉండే అవకాశమున్నాయి.
ఏఐ భయాలు, టెక్ దిగ్గజాల ఆందోళనలు
ఒకవైపు మస్క్, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు భారీ ఆఫర్లతో వార్తల్లో నిలుస్తుండగా, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న వేగంపై అమెరికా ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వేల ప్రకారం, మెజారిటీ ప్రజలు ఏఐ సాంకేతికత సమాజంలోకి అతివేగంగా చొచ్చుకుపోతోందని భావిస్తున్నారు.
మార్కెట్ పోటీ, స్పేస్ఎక్స్ షేర్ల పరిస్థితి
మరోవైపు ఆంథ్రోపిక్ సంస్థను లాభాలతో పాటు సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చే పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దిన వ్యవస్థాపకులు, త్వరలోనే భారీ ఐపీఓ (IPO) ద్వారా ప్రజా మూలధనాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్పేస్ఎక్స్ షేర్ల ధరలు మార్కెట్లో కొంత ఒడుదొడుకులకు గురవుతున్నాయి.








