వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే సంచలన సవాల్..!
చంద్రగిరి నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి సవాల్-ప్రతిసవాళ్ల పర్వం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యే పులివర్తి నాని(Pulivarthi Nani) విపక్ష వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు నియోజకవర్గంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వైసీపీ నేతలను ఉద్దేశించి ఎమ్మెల్యే పులివర్తి నాని ఒక బహిరంగ సవాల్ విసిరారు. “నేను నా నియోజకవర్గంలో ఎక్కడికైనా, ఏ మండలానికైనా సింగిల్‌గా బుల్లెట్ బైక్ వేసుకుని ప్రజల్లోకి వెళ్తాను. వైసీపీ నాయకులకు ఆ దమ్ముందా? వాళ్లు బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా కనీసం బయటకు రాగలరా..?” అని నాని ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధిగా తాను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేందుకు సిద్ధమని, కానీ ప్రతిపక్ష నేతలు భద్రతా వలయాలు లేకుండా తిరగలేరని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ సొంత పార్టీ నాయకులను నమ్మడం లేదని, అందుకే నియోజకవర్గంలో వారు సరికొత్త డ్రామాలకు తెరలేపారని పులివర్తి నాని ఆరోపించారు. స్థానిక ఎన్నికల వేళ ఉనికి చాటుకోవడానికి, వైసీపీ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయడానికి సానుభూతి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి తమపై తామే దాడులు చేయించుకుంటూ, ఆ నెపాన్ని అధికార తెలుగుదేశం, కూటమి నాయకులపై నెట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత వైసీపీ హయాంలో పోలీసులను, ప్రభుత్వ వ్యవస్థలను బంట్రోతులుగా వాడుకుని చంద్రగిరిలో అరాచకాలు సృష్టించారని, తనపై కూడా 39 అక్రమ కేసులు పెట్టించారని నాని మండిపడ్డారు. ప్రజల్లో నిజంగా ఆదరణ ఉంటే ఎవరైనా స్వేచ్ఛగా, ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా తిరగవచ్చని నాని హితవు పలికారు. చంద్రగిరి ప్రజలు ఇప్పటికే ఫ్యాక్షన్, బ్లాక్ మెయిల్ రాజకీయాలను తిరస్కరించారని, ఇప్పటికైనా డ్రామాలు పక్కనబెట్టి దమ్ముంటే నేరుగా జనంలోకి రావాలని ఆయన సవాల్ విసిరారు. రేపటి నుంచి తాను నియోజకవర్గం అంతా బుల్లెట్ బైక్‌పైనే పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకుంటానని చంద్రగిరి ఎమ్మెల్యే స్పష్టం చేశారు.








