విజయసాయిరెడ్డి ముహూర్తం వెనుక 11 సెంటిమెంట్ ట్విస్ట్..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సరికొత్త సమీకరణానికి తెర లేస్తూ, మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ముహూర్తాన్ని అధికారికంగా ఖరారు చేశారు. దసరా పండుగ శుభ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ సంచలన ప్రకటనను వెలువరించారు. ఈ ఏడాది 11వ నెల 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ‘ఎ-కన్వెన్షన్ సెంటర్’ వేదికగా తన నూతన రాజకీయ పార్టీని, దానికి సంబంధించిన జెండా, ఎజెండాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
పార్టీ స్థాపించే నెల, తేదీ, గంటలు, నిమిషాలు ఇలా అన్నీ ’11’ సంఖ్య వచ్చేలా ఆయన ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారింది. విజయసాయిరెడ్డి తన సరికొత్త రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ప్రతిపాదించిన 10 పాయింట్ల ఫార్ములా, లక్ష్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న రెండు ప్రధాన పార్టీలు, రెండు కుటుంబాల రాజకీయ దోపిడీకి చరమగీతం పాడటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ పాలనకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు ముగింపు పలికి క్లీన్ గవర్నెన్స్ అందిస్తామని పేర్కొన్నారు.
అంతేకాకుండా తాము స్థాపించబోయే నూతన పార్టీని యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఒక ‘జెన్-జీ (Gen-Z) నాయకుల తయారీ ఫ్యాక్టరీ’గా తీర్చిదిద్దుతామని, యువతకు వంద శాతం ఉపాధి అవకాశాలు, ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్తు వంటి ప్రజాకర్షక హామీలతో ముందుకు సాగుతామని ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనం, కొత్త పార్టీ ఏర్పాటుపై పలు రకాల ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ తాజా అధికారిక ప్రకటనతో వాటన్నింటికీ తెరపడింది.
ఈ ముహూర్తంపై రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన ట్విస్ట్‌ను కూడా ప్రస్తావిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి తన పార్టీ ఆవిర్భావానికి అన్నిటా ’11’ సంఖ్య వచ్చేలా సెంటిమెంట్‌ను ఎంచుకోవడం వెనుక ఆ సంఖ్యతో వైసీపీ నాయకత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చే వ్యూహం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా నవంబర్ 11న విజయవాడలో జరగబోయే ఈ ఆవిర్భావ సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో చూడాలి.








