కాంగ్రెస్ మైండ్ గేమ్.. బీఆర్ఎస్ లీగల్ కౌంటర్!
తెలంగాణ రాజకీయాల్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా మరోసారి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి అక్రమంగా నీటిని తరలించుకుంటున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు నీటిని సామాన్య రైతులకు అందకుండా సొంత ప్రయోజనాల కోసం మళ్లించారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చి, ప్రధాన ప్రతిపక్ష నేతను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ లీగల్ సెల్ దీటుగా తిప్పికొట్టింది. అంతటితో ఆగకుండా పరువు నష్టం నోటీసులతో న్యాయపోరాటానికి సిద్ధమవడంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరుగింది.
కాంగ్రెస్ వ్యూహం పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమేనన్న విశ్లేషణలు బలపడుతున్నాయి. కొండపోచమ్మ సాగర్ కాలువల డిజైన్ సమయంలోనే కేసీఆర్ తన భూములకు ప్రత్యేకంగా అండర్‌గ్రౌండ్ పైప్లైన్లు ఏర్పాటు చేసుకున్నారనేది కాంగ్రెస్ వాదన. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ప్రభుత్వ విచారణకు సిద్ధమవుతున్నారు. కాళేశ్వరం వైఫల్యాలు, మేడిగడ్డ కుంగుబాటు తదితర అంశాలపై నిత్యం బీఆర్ఎస్ను కార్నర్ చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పుడు నేరుగా కేసీఆర్ వ్యక్తిగత ఆస్తులు, ఫామ్‌హౌస్ నీటి వాడకంపై దృష్టి పెట్టడం ద్వారా నైతికంగా దెబ్బతీయాలని చూస్తోంది. రైతుల సాగునీటి కష్టాలను కేసీఆర్ స్వార్థంతో ముడిపెట్టి ప్రజల్లో బలమైన వ్యతిరేక నరేటివ్‌ను సృష్టించాలనేది హస్తం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు.. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ కొట్టిపారేయడమే కాకుండా అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగింది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో దశాబ్దాలుగా ఉన్న సొంత బోరుబావులు, భూగర్భ జలాలు, స్థానిక చెరువుల ఆధారంగానే వ్యవసాయం సాగుతోందని, కొండపోచమ్మ సాగర్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా అక్రమంగా రాలేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వంశీకృష్ణలకు 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా నోటీసులు జంపింది. రాష్ట్రంలో పాలనా వైఫల్యాలు, సాగునీటి కొరత, రైతుల సమస్యలు, పంట నష్టపరిహారం వంటి ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజుకో డ్రామా ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్య నేతలు విమర్శిస్తున్నారు.
ఈ వివాదం అక్రమంగా నీటి తరలింపునకు సంబంధించింది. ఇది మున్ముందు రెండు పార్టీల మధ్య తీవ్ర ఆధిపత్య పోరుకు దారితీసేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలు తమ ఆరోపణలకు తగిన ఆధారాలను న్యాయస్థానం ముందు లేదా విచారణ కమిషన్ ఎదుట నిరూపించాల్సి ఉంటుంది. ఒకవేళ నిరూపించలేకపోతే అది కాంగ్రెస్ రాజకీయ వ్యూహానికే ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. మొత్తానికి.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగుతున్న ఈ నీటి రాజకీయం తెలంగాణ రాజకీయ రణరంగంలో రానున్న రోజుల్లో ఏయే మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.








