ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి కవిత పార్టీ!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ నేత, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి అడుగుపెట్టింది. ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీ తరఫున అభ్యర్థిని కవిత ప్రకటించారు. దసరా పర్వదినం వేళ ఆమె ఈ ప్రకటన చేశారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ అభ్యర్థిగా కవిత ఖరారు చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన శ్రీకాంత్ గౌడ్, మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. గతంలో ‘తెలంగాణ జాగృతి’ నుంచి కవిత వెన్నంటి నడిచిన ఆయన, ప్రస్తుతం తెలంగాణ రక్షణ సేన అధికార ప్రతినిధిగా ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్నారు. బహుజనుల సాధికారతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, విద్యావంతుడైన బీసీ వర్గానికి చెందిన నేతకు తొలి అవకాశం ఇవ్వడం ద్వారా బలమైన సంకేతాలు పంపారు.
పార్టీ పెట్టిన తర్వాత కవిత పలు కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పుడూ ఎన్నికల బరిలోకి దిగలేదు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రుల మద్దతును కూడగట్టడం ద్వారా పార్టీ బలాన్ని క్షేత్రస్థాయిలో నిరూపించుకోవాలని కవిత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నికల సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్‌కు స్టేట్ పార్టీ అబ్జర్వర్‌గా అప్పగించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసే పనిలో పడ్డారు.
ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ప్రకటనతో ప్రచార వేగం పెంచిన పార్టీ అధినేత్రి కవిత, మరోవైపు సంస్థాగత నిర్మాణాన్ని కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా కరీంనగర్ జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా బోడ రాకేష్ రెడ్డిలతో పాటు ఇతర ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ తరుణంలో తెలంగాణ రక్షణ సేన ప్రత్యక్ష పోరుకు సై అనడం, విద్యావంతులు, పట్టభద్రుల ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే అంశంపై రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి నెలకొంది. దసరా వేళ అభ్యర్థి ప్రకటనతో మొదలైన ఈ ప్రచార పర్వం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులకు దారితీస్తుందో వేచి చూడాలి.








