బస్సుల్లో, రైళ్ళలో ఫోన్ సౌండ్‌తో ఇబ్బంది పెట్టేవారిపై భారీ జరిమానా..!
బస్సులోనో, రైలులోనో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తి ఫోన్లో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టినా, వీడియోలు చూస్తూ హడావుడి చేసినా చిరాకు వస్తుంది కదా! మనకు ఇష్టం లేకపోయినా ఆ శబ్దాన్ని భరించాల్సిందే. కానీ బ్రిటన్‌లో మాత్రం ఇలాంటి ప్రవర్తనకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అది బస్ అయినా, ట్రైన్ అయినా హెడ్ఫోన్లు లేకుండా పెద్ద సౌండ్‌తో పాటలు, వీడియోలు ప్లే చేస్తే 100 పౌండ్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఫోన్లో పెద్ద సౌండ్‌తో వీడియోలు చూస్తే జరిమానా!
ప్రజా రవాణాలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనను అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం అక్టోబర్ 19న కొత్త అమలు మార్గదర్శకాలను ప్రకటించింది. ముఖ్యంగా బస్సుల్లో మొబైల్ ఫోన్లలో పాటలు, వీడియోలను హెడ్ఫోన్లు ఉపయోగించకుండా పెద్ద శబ్దంతో వినిపించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.
ఈ తరహా ప్రవర్తనను బ్రిటన్‌లో ‘లౌడ్కాస్టింగ్’ లేదా ‘సోడ్కాస్టింగ్’ అని పిలుస్తారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఫోన్లో శబ్దాలు వినిపించడం, బస్సుల్లో ఈ-సిగరెట్లు ఉపయోగించడం, చెత్త వేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలపై కూడా అధికారులు దృష్టి పెట్టనున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి 100 పౌండ్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.12 వేల వరకు ఉంటుంది.
శబ్ద కాలుష్యంతో విసిగిపోతున్న ప్రయాణికులు!
బ్రిటన్‌లో ప్రజా రవాణాలో పెద్ద శబ్దాలతో ఇతరులను ఇబ్బంది పెట్టడం చాలాకాలంగా సమస్యగా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ (TfL), ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేలో దాదాపు 10 మందిలో ఏడుగురు.. ఇతర ప్రయాణికులు హెడ్ఫోన్లు లేకుండా పాటలు వినిపించడం లేదా ఫోన్లో పెద్దగా మాట్లాడటం వల్ల అసౌకర్యానికి గురవుతున్నట్లు వెల్లడైంది.
ఈ సమస్య కేవలం చిరాకుతోనే ఆగిపోవడం లేదు. కొందరు ప్రయాణికులు ఇలాంటి ప్రవర్తనను భరించలేక బస్సు ప్రయాణాలనే మానేస్తున్నారు.బస్సుల్లో పదేపదే ఎదురైన శబ్దాలు, ఇతరుల అసభ్య ప్రవర్తన కారణంగా బస్సుల్లో వెళ్లడం మానేసినట్లు చాలా మంది మీడియాతో చెప్పారు.
మనం సోషల్ మీడియాలో చూడకూడదనుకున్న వీడియోలను కూడా పక్కన వ్యక్తి ఫోన్లో పెద్ద సౌండ్‌తో ప్లే చేస్తే తప్పనిసరిగా వినాల్సి వస్తోందని ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని అధికారులు వివరించారు.
శబ్దం మాత్రమే కాదు.. భద్రతపైనా ఆందోళన
ప్రయాణికులను ఇబ్బంది పెట్టే ప్రవర్తన వల్ల ప్రజా రవాణాపై నమ్మకం కూడా తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన స్వతంత్ర రవాణా పర్యవేక్షణ సంస్థ ట్రాన్స్పోర్ట్ ఫోకస్ సిబ్బంది అలెక్స్ క్యాంప్‌బెల్ తెలిపిన వివరాల ప్రకారం, సర్వేలో పాల్గొన్న ప్రయాణికుల్లో ప్రతి పది మందిలో నలుగురు ప్రయాణ సమయంలో ఇతరుల అసాంఘిక ప్రవర్తన కారణంగా ఆందోళనకు గురవుతున్నట్లు చెప్పారు.
పెద్ద శబ్దంతో పాటలు వినిపించడం, ఈ-సిగరెట్లు ఉపయోగించడం వంటి చర్యలను అరికడితే ప్రయాణ వాతావరణం మెరుగుపడటమే కాకుండా ప్రజలు మళ్లీ ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యలను రవాణా కార్మిక సంఘాలు కూడా స్వాగతించాయి. ప్రజా రవాణాలో అసాంఘిక ప్రవర్తనను నియంత్రించే దిశగా ఇది సరైన ముందడుగు అని రవాణా కార్మిక సంఘం TSSA ప్రధాన కార్యదర్శి మరియం ఎస్లామ్డౌస్ట్ పేర్కొన్నారు.
రైళ్లలో అయితే మరింత కఠినమైన నిబంధనలు!
బ్రిటన్‌లో రైళ్లలో పెద్ద శబ్దంతో పాటలు వినిపించడం, గట్టిగా పాడటం, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనపై 2005 నుంచే నిషేధం ఉంది. శబ్దం తగ్గించమని చెప్పినా వినకపోతే ప్రయాణికులను రైలు నుంచి దించేయవచ్చు. కొన్ని సందర్భాల్లో 1,000 పౌండ్ల వరకు జరిమానా కూడా విధించవచ్చు.
కొత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలతో పాటు నిబంధనల అమలుపైనా దృష్టి పెట్టనుంది. బస్సుల విషయంలో స్థానిక ప్రభుత్వాల అమలు అధికారాలను ఉపయోగించుకోనుండగా, రైళ్లలో హెడ్ఫోన్లు వాడాలని, శబ్దాన్ని తగ్గించాలని ప్రయాణికులకు సూచించే ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది.
ప్రజా రవాణా అంటే ఒకరు ప్రయాణించే స్థలం మాత్రమే కాదు.. అనేకమంది తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించుకునే ఉమ్మడి ప్రదేశం. మనకు నచ్చిన వీడియోను చూడటం మన వ్యక్తిగత స్వేచ్ఛే కావచ్చు. కానీ ఆ వీడియో శబ్దాన్ని ఇష్టంలేని పదిమందికి వినిపించడం మాత్రం వారి స్వేచ్ఛకు భంగం కలిగించడమే. బ్రిటన్ తీసుకుంటున్న ఈ చర్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం కూడా ఇదే. ప్రపంచంలో మిగతా దేశాలు వారు కూడా ఈ చర్యలు తీసుకుంటే బాగుండును అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








