పోలీసు శాఖపై రేవంత్ రాజకీయ వ్యూహం!
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు బలగాల సంక్షేమం, పరిపాలనా సంస్కరణల అంశాలు ఎప్పుడూ చర్చనీయాంశాలే. హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. కేవలం శాఖాపరమైన సమీక్షకే పరిమితం కాకుండా.. రాబోయే రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, పాలనా శైలిని వివరిస్తూ ఆయన ప్రసంగం సాగింది. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన అజెండా అని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశ నిర్దేశం చేశారు. ముఖ్యంగా 2028 నాటికి పోలీసు శాఖలో ఉన్న అన్ని ఖాళీలను విడతల వారీగా భర్తీ చేస్తామని ప్రకటించారు. గత బీఆర్ఎస్ పాలనపై నిరుద్యోగులు, పోలీసు ఉద్యోగార్థుల నుంచి వ్యక్తమైన అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రభుత్వంలో నియామకాలు పారదర్శకంగా జరుగుతాయనే భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే 4,773 కానిస్టేబుల్ పోస్టులతో పాటు మొత్తం 7,437 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు ప్రకటించారు. అలాగే 112 మంది డీఎస్పీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. తద్వారా తమ ప్రభుత్వం పట్ల యువతలో సానుకూల దృక్పథాన్ని పెంచే ప్రయత్నం చేశారు.
పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే.. హోదాను బట్టి ఎక్స్గ్రేషియాను కోటికి పైగా పెంచడం, పోలీసు అధికారుల పిల్లల చదువుల కోసం అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలను గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసు సిబ్బంది కుటుంబాలను తమ వైపునకు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. అలాగే హోంగార్డుల కుటుంబాలకు వైద్య భద్రత కల్పించడం ద్వారా అట్టడుగు వర్గాల సిబ్బందిలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి.
మరోవైపు.. రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్, కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని సీఎం హెచ్చరించారు. ‘టీజీ సేఫ్’ ద్వారా కల్తీపై నిరంతర నిఘా ఉంచడం, డ్రగ్స్ కట్టడిలో రాష్ట్ర పోలీసు శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం వంటి అంశాలను ప్రభుత్వం తన పాలనా విజయాలుగా చెప్పుకున్నారు. సామాజిక సంస్కరణల్లో భాగంగా ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలు అప్పగించడం వంటి సాహసోపేత నిర్ణయాలు ప్రభుత్వ ప్రగతిశీల భావజాలానికి అద్దం పడుతాయన్నారు.
అయితే… బాధితులు, సామాన్యులు, అభం శుభం తెలియని వారిపట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని, అదే సమయంలో నేరస్థులు, కబ్జాదారులు, అసాంఘిక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై రాజీపడే ప్రసక్తే లేదనే సంకేతాలు పంపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో తామే రోల్ మోడల్ అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. మొత్తానికి, పోలీసు శాఖను ఆధునీకరిస్తూనే, పాలనాపరమైన పట్టును నిరూపించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేదికను సమర్థవంతంగా వాడుకుందనే చెప్పాలి.








