అమెరికాలో ట్రంప్ కొత్త స్క్రీమ్: ప్రభుత్వ మోసాన్ని బయటపెడితే లక్షల్లో బహుమతి!
ప్రభుత్వ పథకాల పేరుతో కొందరు కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారని మీకు తెలిస్తే ఏం చేస్తారు? ఆ విషయం అధికారులకు చెబుతారా..లేక మనకెందుకులే లేనిపోయిన తలనొప్పి అని ఊరుకుంటారా! ఎక్కువ శాతం ఊరుకుంటామనే చెప్తారు. అయితే ఇప్పుడు అదే సమాచారం ఇచ్చినందుకు మీకు లక్షల రూపాయలు బహుమతిగా కూడా ఇస్తామంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రభుత్వ డబ్బును అక్రమంగా తీసుకున్నవారి గురించి సమాచారం ఇచ్చి, ఆ సొమ్మును తిరిగి రాబట్టడంలో సాయం చేస్తే నగదు బహుమతి అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు.
మోసాన్ని బయటపెడితే డబ్బులు కూడా వస్తాయ్!
ఈ కార్యక్రమం పేరు ‘Fraud Whistleblower Incentive Program’. ప్రభుత్వానికి చెందిన డబ్బు ఎక్కడైనా దుర్వినియోగం అవుతున్నా, పథకాల పేరుతో తప్పుడు క్లెయిమ్‌లు చేసి నిధులు కొల్లగొడుతున్నా.. అలాంటి విషయాలను ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ జరిగి, చట్టపరమైన చర్యల తర్వాత ప్రభుత్వం పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టగలిగితే, సమాచారం ఇచ్చిన వ్యక్తికి బహుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది.
అయితే, ఏదో ఒక ఫిర్యాదు చేసి బహుమతి అడిగితే సరిపోదు. మనం ఇచ్చిన సమాచారం నిజమై ఉండాలి. ఆ సమాచారంతోనే ప్రభుత్వానికి పోయిన డబ్బు తిరిగి రావాలి. అప్పుడే బహుమతికి అర్హత లభిస్తుంది.
గరిష్ఠంగా రూ.25 లక్షలకు పైగా!
ఈ పథకం కింద తిరిగి రాబట్టిన మొత్తంలో గరిష్ఠంగా ఒక శాతం వరకు బహుమతిగా చెల్లించనున్నారు. అర్హత పొందిన ఒక్కో వ్యక్తికి గరిష్ఠంగా 30 వేల డాలర్ల వరకు ఇవ్వొచ్చు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25 లక్షలకు పైమాటే. అయితే, ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం వస్తుందని కాదు. ఎంత డబ్బు తిరిగి రాబట్టారు, పథకానికి సంబంధించిన నిబంధనలు ఏమిటి అనే అంశాలపై బహుమతి ఆధారపడి ఉంటుంది.
ఈ కార్యక్రమం కోసం 25 మిలియన్ డాలర్లు కేటాయించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా న్యాయశాఖ ఈ పథకాన్ని నిర్వహించనుండగా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కూడా ఇందులో భాగస్వామిగా ఉండనుంది.
ఇవి కూడా చదవండి
సామాన్యుల నుంచి జర్నలిస్టుల వరకు.. అందరికీ అవకాశం!
ప్రభుత్వంలో జరిగే ప్రతి అక్రమం అధికారులకు వెంటనే తెలిసిపోదు. కొన్నిసార్లు స్థానికంగా ఉండే వ్యక్తులకు, ప్రభుత్వ పథకాలతో సంబంధం ఉన్నవారికి లేదా వాటిపై పరిశోధన చేసే జర్నలిస్టులకు కీలకమైన సమాచారం దొరుకుతుంది. అలాంటి వారు తమ దగ్గరున్న వివరాలను అధికారులకు అందిస్తే, మోసాలను గుర్తించడం సులభమవుతుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటును కూడా ప్రకటించారు. అయితే, సమాచారం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ బహుమతి అందదు. అధికారులు ఆ వివరాలను పరిశీలించి, వాటి ఆధారంగా చర్యలు తీసుకున్న తర్వాతే అర్హతను నిర్ణయిస్తారు.
ఓ యువ జర్నలిస్టుకు ఇప్పటికే 10 వేల డాలర్లు!
ఈ పథకాన్ని ప్రకటించడానికి ముందు నిక్ షిర్లీ అనే యువ స్వతంత్ర జర్నలిస్టుకు ట్రంప్ 10 వేల డాలర్ల చెక్కును అందించారు. షిర్లీ చేసిన రిపోర్టింగ్ తర్వాత అధికారులు కొందరు అనుమానితులను అరెస్టు చేశారని, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో తప్పుడు క్లెయిమ్‌ల ద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకున్నారని వెల్లడైంది.
ప్రభుత్వ డబ్బు ఎక్కడ ఎలా దుర్వినియోగం అవుతోందో బయటపెట్టేవారికి ప్రోత్సాహకం ఇస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పుడు సామాన్య ప్రజలను కూడా ఈ ప్రయత్నంలో భాగస్వాములను చేయాలని చూస్తోంది.
బహుమతి కోసం తప్పుడు ఫిర్యాదులు చేస్తే?
ఈ పథకంలో ఓ సమస్య కూడా ఉంది. డబ్బు వస్తుందనే ఆశతో కొందరు ఆధారాలు లేని ఫిర్యాదులు చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత కక్షలతో తప్పుడు ఆరోపణలు చేసేవారూ ఉండొచ్చు. అలాంటి ఫిర్యాదులను పరిశీలించడానికే అధికారులు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తే, నిజంగా జరిగిన మోసాలపై విచారణ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.
అందుకే బహుమతి ప్రకటించడం ఒక్కటే సరిపోదు. నిజమైన ఫిర్యాదులను గుర్తించడం, తప్పుడు ఆరోపణలను అడ్డుకోవడం కూడా ముఖ్యం. ఈ రెండింటినీ సమర్థంగా నిర్వహించగలిగితేనే ప్రభుత్వానికి పోయిన డబ్బును తిరిగి రాబట్టడంలో ఈ పథకం ఉపయోగపడుతుంది.
ప్రభుత్వ డబ్బు కాజేసినవారి గురించి సమాచారం ఇస్తే మీకూ లక్షల రూపాయలు వచ్చే అవకాశం.. వినడానికి బాగానే ఉంది! కానీ ఈ పథకం వల్ల నిజంగానే అక్రమాలు తగ్గుతాయా? లేక బహుమతి కోసం తప్పుడు ఫిర్యాదులు పెరుగుతాయా? అన్నది ఇప్పుడు చూడాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








