ట్రంప్ తర్వాత అధ్యక్షుడు ఎవరు? రేసులో ఉన్న జేడీ వాన్స్‌కు ఏమంటున్నారు?!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలన ముగుస్తున్న వేళ, తదుపరి 2028 అధ్యక్ష ఎన్నికల రేసుపై అమెరికా రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున రేపటి నాయకుడిగా అత్యంత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు జేడీ వాన్స్ (ప్రస్తుత ఉపాధ్యక్షుడు). అయితే, ఆ రేసులోకి దిగడంపై ఆయనెంతో ఆచితూచి మాట్లాడుతున్నారు. CBS న్యూస్ మిషిగన్‌లోని ఫ్లాట్ రాక్‌లో నిర్వహించిన టౌన్ హాల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, తన నిర్ణయం వెనుక ఉన్న వ్యక్తిగత, కుటుంబ విషయాలను ఎంతో ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు.
2028 రేసుపై జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
టౌన్ హాల్ కార్యక్రమంలో ‘2028 అధ్యక్ష ఎన్నికల్లో మీరు పోటీ చేయకపోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా?’ అని ప్రశ్నించగా, వాన్స్ చాలా నర్మగర్భంగా స్పందించారు. “ఖచ్చితంగా ఉన్నాయి, నేను బరిలోకి దిగకపోవచ్చు కూడా” అంటూ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం విమర్శకులు, విశ్లేషకులు అందరూ ఆయననే ట్రంప్ వారసుడిగా చూస్తున్నప్పటికీ, పోటీ విషయంలో తన మనసులో ఎన్నో సందేహాలు, బాధ్యతలు మెదులుతున్నాయని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
కుటుంబం, భార్య ఉషా అభిప్రాయమే కీలకం
రాజకీయాల్లో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఇంటి దగ్గర ఉండే బాధ్యతలు వేరుగా ఉంటాయని వాన్స్ గుర్తుచేశారు. తనకు, తన భార్య ఉషా వాన్స్‌కు నలుగురు చిన్నపిల్లలు ఉన్నారని, వారికోసం సమయం కేటాయించడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. తన భార్య ఉషాకు ప్రజలకు సేవ చేయడం అంటే ఇష్టమే కానీ, రోజూ ఆ రాజకీయ వ్యూహాలు, ప్రచారాలు, రచ్చ అంటే అంతగా నచ్చదని చెప్పారు. కేవలం తన వ్యక్తిగత ఆశయం కోసమే నిర్ణయం తీసుకోలేనని, ఆ ప్రభావం కుటుంబంపై పడకుండా చూసుకోవడం కూడా తన బాధ్యత అని స్పష్టం చేశారు.
ఇప్పుడే నిర్ణయం లేనట్టే, మధ్యంతర ఎన్నికలపైనే దృష్టంతా
ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తాను వాయిదా వేస్తుంటానని, ఇదే విషయాన్ని తన భార్య ఉషా కూడా ఆటపట్టిస్తుంటుందని వాన్స్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. 2028 గురించి ఇప్పుడే ఆలోచించడం అనవసరమని, తామిద్దరం ఆ విషయంపై ఇంకా సీరియస్‌గా కూర్చుని మాట్లాడలేదని తెలిపారు. ప్రస్తుతానికి నవంబర్‌లో రాబోయే మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌పై రిపబ్లికన్ పార్టీ పట్టు తగ్గకుండా చూసుకోవడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని, ఆ ఎన్నికలు అయిపోయాకే భవిష్యత్తు గురించి ఆలోచిస్తానని చెప్పారు.
ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీ బాట ఎటు?
ఒకప్పుడు ‘హిల్‌బిల్లీ ఎలిజీ’ పుస్తకంతో ప్రసిద్ధి చెంది, ఈరోజు ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగిన వాన్స్ వ్యాఖ్యలు రిపబ్లికన్ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. ఈ టౌన్ హాల్లో ఆయన కేవలం తన రేసు గురించే కాకుండా, అమెరికా ఆర్థిక విధానాలు, ఇమిగ్రేషన్, సాంకేతిక రంగం, ఇరాన్ వివాదం వంటి అనేక అంశాలపై మాట్లాడి మిషిగన్ ఓటర్ల మద్దతు కోరారు. ఒకపక్క కుటుంబం, మరోపక్క రాజకీయ ప్రాధాన్యతలను బ్యాలెన్స్ చేసుకుంటున్న వాన్స్.. నవంబర్ మధ్యంతర ఎన్నికల తర్వాత ఎలాంటి కీలక ప్రకటన చేస్తారో చూడాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








