కాంగ్రెస్, సీజేపీ ఆందోళనలపై బీజేపీ కౌంటర్ ఎటాక్
దేశ రాజకీయాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఎన్నికల సంఘం విశ్వసనీయతపై రాజుకున్న వివాదం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ఆందోళనలను తీవ్రంగా పరిగణిస్తున్న బీజేపీ, దీనికి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా.. బలమైన యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది. విపక్షాల తీరును విమర్శిస్తు, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే కుట్రలను తిప్పికొట్టేందుకంటూ కాషాయదళం సమాయత్తమవుతోంది. తెలంగాణ బీజేపీ కూడా ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది.
దేశ భద్రత, అర్హులైన ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా బీజేపీ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 5 వరకు 15 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. “లోక్తంత్ర బచావో, భీడ్తంత్ర హటావో” అనే నినాదంతో ఈ ఉద్యమం సాగనుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలలో జరిగిన సంక్షోభాలను ఉదహరిస్తూ, ప్రజాస్వామ్య ముసుగులో జరుగుతున్న అరాచక రాజకీయాలు దేశ భద్రతకే ముప్పుగా మారుతున్నాయని బీజేపీ హెచ్చరిస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, రాజ్యసభ సభ్యులు డా.కె. లక్ష్మణ్ ఈ అంశంపై విపక్షాల తీరును తప్పుబట్టారు. రేపు రాష్ట్ర కార్యాలయంలో అన్ని జిల్లాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఈ ఉద్యమ కార్యాచరణను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నవంబర్ 1న హైదరాబాదులో కాంగ్రెస్, ఇతర విపక్షాల తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షుల నేతృత్వంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న బీజేపీ ఇంచార్జ్ సునీల్ బన్సల్ సమక్షంలో ఈ కార్యక్రమాల అమలుపై తుది విధివిధానాలు ఖరారు కానున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై ఎంపీ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా చనిపోయిన వారి పేర్లు తొలగిస్తే విపక్షాలకు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చినప్పటికీ, 13 కోట్ల ఓట్ల తొలగింపుపై ఆధారాలు చూపకుండా రాహుల్ గాంధీ వితండవాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లినట్లు.. ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై బురదజల్లే సంస్కృతి ఆ పార్టీదని విమర్శించారు. విదేశీ ఫండింగ్ ద్వారా దేశంలో అశాంతిని, అరాచకత్వాన్ని సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, న్యాయస్థానాలపై ఒత్తిడి తెచ్చేలా నిరసనలు చేయడం దారుణమని ఆరోపించారు.
కేవలం ఖండనలకే పరిమితం కాకుండా, ప్రజాక్షేత్రంలో వాస్తవాలు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా పారదర్శకతపై అవగాహన కల్పించనుంది. నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు, పాదయాత్రలు చేపట్టనుంది. విద్యార్థులు, యువజనులు, మేధావులతో ప్రత్యేక సదస్సులు, చర్చా వేదికల ఏర్పాటు చేస్తుంది. ఎన్నికల సంఘం విశ్వసనీయతను సమర్థిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రెస్ మీట్లు నిర్వహించనుంది. రాజ్యాంగ వ్యవస్థల ఉనికే ప్రశ్నార్థకం చేసేలా సాగుతున్న విపక్షాల ఒత్తిడి రాజకీయాలను ప్రజా మద్దతుతో తిప్పికొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈ సమరశంఖం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.








