3 లక్షలకు పైగా వీసాల రద్దు.. ట్రంప్ నయా రికార్డ్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసల నియంత్రణను ఉద్యమంలా సాగిస్తున్నారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా మేక్ గ్రేట్ ఎగైన్ అంటూ .. తన హామీలకు కట్టుబడి కఠిన చర్యలకు దిగుతున్నారు. సెకండ్ టెర్మ్ ట్రంప్ హయాంలో ఇప్పటివరకూ సుమారు మూడు లక్షల వీసా (Visa)లను రద్దు చేసినట్లు తెలిసింది. వీటిలో ‘బర్త్ టూరిజం’ (Birth Tourism) కోసం వచ్చినవారివే ఎక్కువ ఉన్నాయి. అలాంటి చర్యలకు సహకరించారని ఆరోపణలు ఉన్నవారికి సంబంధించిన నాలుగు వేల వీసాలూ అందులో ఉన్నట్లు సమాచారం.
హింస, ప్రజా భద్రతకు ముప్పు, మోసం, తప్పుడు సమాచార వ్యాప్తి, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని ట్రంప్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ధ్రువీకరించారు.
చరిత్రలో మరే అధ్యక్షుడు చేయని విధంగా ట్రంప్ అత్యధిక వీసాలు రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. అమెరికాలో ఉంటూ చట్టాన్ని ఉల్లంఘించేలా, జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించే విదేశీ పౌరులపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. మొత్తం రద్దయిన మూడు లక్షల వీసాల్లో రెండున్నర లక్షలు గతేడాది జనవరిలో రద్దు చేసినట్లు తెలిపారు.
వీసాల రద్దు రెట్టింపు
గతేడాది జనవరిలో ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం అక్రమ వలసదారులను వెనక్కి పంపించే కార్యక్రమం చేపట్టారు. దీంతోపాటు సోషల్ మీడియా వెట్టింగ్ (వీసా జారీ చేయడానికి ముందు అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలన్నీ పరిశీలించడం)తో పాటు స్క్రీనింగ్‌ను విస్తృతం చేశారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించే వారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వీసాల రద్దు గతంతో పోలిస్తే రెట్టింపు అయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉండటం, స్థానిక చట్టాలను ఉల్లంఘించడం లాంటి పనులు చేస్తున్న విదేశీ విద్యార్థులపైనా ట్రంప్ యంత్రాంగం నిఘా పెట్టింది.








