పాకిస్తాన్ ను వణికిస్తున్న ఢోబాల్..!
పొరుగుదేశం పాకిస్తాన్ కు కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్నది ఎవరో తెలుసా.. ఆయనే అజిత్ ఢోబాల్..భారత్ ప్రత్యర్థుల కుయుక్తులను ముందుగానే గుర్తించి వాటికి చెక్ పెట్టడంలో అజిత్ డోభాల్ (Ajit Doval) దిట్ట. అందుకే ఆయన వ్యూహాలు పాకిస్థాన్‌కు నిద్రలేకుండా చేస్తున్నాయి. పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (విశ్రాంత) మజహర్ జమీల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.. కొన్ని రోజుల క్రితం లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (IISS)లో ఆయన మాట్లాడిన మాటలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
పాకిస్థాన్ (Pakistan)లో అశాంతిని సృష్టించడానికి భారత్ ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా వాడుతోందని జమీల్ ఆరోపించారు. టీటీపీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉగ్ర సంస్థలకు మద్దతు ఇవ్వడం అందులో భాగమేనంటూ డొల్లవాదనలు చేశారు. పాక్‌లో అస్థిరతను సృష్టించడానికి అజిత్ డోభాల్ (Ajit Doval) సిద్ధాంతాన్ని .. భారత్ అమలు చేస్తోందన్నారు. 1971లో ముక్తి వాహిని, 1980ల్లో ఎల్టీటీఈకి భారత్ మద్దతు ఇచ్చిందని తన ప్రసంగంలో నోరు పారేసుకున్నారు. 2001 నుంచి 2014 మధ్య అఫ్గాన్ – పాకిస్థాన్‌కు మధ్య ఉన్న సరిహద్దు సమీపంలో భారత్ ఆరు కాన్సులేట్లు నడిపిందన్నారు. ఇవన్నీ ఉగ్రవాదానికి భారత్ మద్దతు ఇస్తుందనడానికి నిదర్శనమంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు.
అలాగే గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో అణు, సంప్రదాయ ఆయుధాలను మోసుకెళ్లగల బ్రహ్మోస్ క్షిపణులను (BrahMos) భారత్ ఉపయోగించిందని ఆరోపించారు. భారత్ అనుసరిస్తున్న ‘నో ఫస్ట్ యూజ్’ (ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించబోం) విధానం ఒక దౌత్యపరమైన వ్యూహం మాత్రమేనని, మొదటిసారే దాడి చేసేలా భారత్ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని మరో చిత్రమైన వాదన వినిపించారు. పాక్‌లోని అంతర్గత అస్థిరతలను ఎలా కట్టడి చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్న షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. ఆ నెపాన్ని భారత్‌పై నెట్టేయడమే ఈ ప్రసంగం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో దక్షిణాసియా మొత్తాన్ని భారత్ అణు విపత్తు అంచు వరకు తీసుకెళ్లిందని, అయితే పాకిస్థాన్ వ్యూహాత్మక సంయమనం వల్లే పరిస్థితి చక్కబడిందని జమీల్ సొంత డబ్బా కొట్టుకున్నారు.








