అణ్వాయుధాలతో పనిలేదు.. అమెరికాది గ్లోబల్ ప్రచారమన్న ఇరాన్..!
పశ్చిమాసియా యుద్ధక్షేత్రంలో అమెరికా, ఇజ్రాయెల్తో పోరాటం చేస్తున్న ఇరాన్.. మరోసారి తన విధానం స్పష్టం చేసింది. తమకు అణ్వాయుధాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలని భావించడం లేదని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. తమ దేశం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అదంతా అబద్ధమని వ్యాఖ్యానించారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
అర్మేనియా రాజధాని యెరెవాన్లో జీవవైవిధ్య సదస్సు సందర్భంగా జార్జియా ప్రధాని ఇరాక్లీ కొబాఖిడ్జేతో పెజెష్కియాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్ అణ్వాయుధాలపై తమ వైఖరిని మరోసారి వెల్లడించారు. అణ్వాయుధాల అభివృద్ధిని నిషేధిస్తూ ఇరాన్ దివంగత సుప్రీం నేత అలీ ఖమేనీ గతంలో స్పష్టమైన వైఖరి తీసుకున్నారని గుర్తుచేశారు.
ఇరాన్ ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉందని పెజెష్కియాన్ చెప్పారు. అయితే తమను లొంగదీసుకోవచ్చని అమెరికా భావిస్తోందని, బలవంతపు చర్యలకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. అమెరికా విధిస్తున్న ఆంక్షలు మానవతా సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ఇరాన్పై ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులను అన్యాయమైన, అమానవీయ చర్యలుగా అభివర్ణించారు.








