మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పూల పరిమళాలతో పరవశించిన మలేషియా .. తెలుగు సంస్కృతికి ప్రవాసుల నీరాజనం
కౌలాలంపూర్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మలేషియాలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కమ్యూనిటీ అసోసియేషన్స్ (FNCA) – మలేషియా ఆధ్వర్యంలో కౌలాలంపూర్‌లోని బ్రిక్ఫీల్డ్స్ కందయ్య హాల్లో నిర్వహించిన ఈ వేడుకలు పూల పరిమళాలతో, బతుకమ్మ అట పాటలతో, జానపద గీతాలతో, కోలాటాల సందడితో ఆహ్లాదభరితంగా సాగాయి. విదేశీ గడ్డపై తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరియగా, ప్రవాస భారతీయులంతా ఒక్కచోట చేరి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు.
మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై, రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లతో, ఆటపాటలతో వేడుకలకు మరింత శోభను చేకూర్చారు. ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు ప్రజలతో పాటు, గత ఐదు దశాబ్దాలుగా మలేషియాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. తరతరాలుగా తెలుగు సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న ప్రవాసుల ఐక్యతకు ఈ వేడుకలు అద్దం పట్టాయి.
ప్రముఖుల హాజరు.. సంప్రదాయాలకు ప్రోత్సాహం
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పెరాక్ రాష్ట్ర శాసనసభ సభ్యురాలు శ్రీమతి వాసంతి సిన్ని సామి, ఇండియన్ లేబర్ వింగ్ అటాచ్ వినయ్ ఆనంద్ హాజరయ్యారు.
వీరితో పాటు తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ చందు , ప్రధాన కార్యదర్శి ఇంద్రనీల్, మలేషియా ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా అధ్యక్షుడు సత్య, ఉపాధ్యక్షుడు రవితేజ, భారత్ రాష్ట్ర సమితి మలేషియా అధ్యక్షుడు మారుతి కుర్మా, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, తెలుగు ఇంటెలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా అధ్యక్షుడు కొణతాల ప్రకాశ్‌రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి వాసంతి సిన్ని సామి మాట్లాడుతూ, మలేషియాలో భారతీయ వారసత్వాన్ని, సాంస్కృతిక విలువలను సజీవంగా ఉంచేందుకు FNCA చేస్తున్న కృషిని అభినందించారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ సమాజం తమ మూలాలను, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఇండియన్ లేబర్ వింగ్ అటాచ్ వినయ్ ఆనంద్ మాట్లాడుతూ, మలేషియాలోని ప్రవాస భారతీయులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా భారత హైకమిషన్ సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు.
బహుమతులు.. విందు.. సాంస్కృతిక సందడి
ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పలు ఆకర్షణీయమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
అత్యంత అందంగా అలంకరించిన బతుకమ్మకు ప్రత్యేక బహుమతిగా రెండు బంగారు నాణేలను అందజేశారు.
బతుకమ్మలను తీసుకొచ్చిన ప్రతి మహిళకు వెండి నాణేలను బహుమతిగా అందించారు.
వేడుకల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సైతం వెండి నాణేలను అందించి నిర్వాహకులు ప్రోత్సహించారు.
సెంట్రల్ స్పైస్ తెలుగు రెస్టారెంట్ సౌజన్యంతో అతిథులకు సంప్రదాయ తెలుగు వంటకాలతో కూడిన విందును ఏర్పాటు చేశారు.
క్వాడ్ ఫిక్స్అప్ ముఖ్య అతిథి శ్రీమతి వాసంతి సిన్ని సామి చేతుల మీదుగా ప్రారంభించారు.
లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి బంగారు, వెండి నాణేలను బహుమతులుగా అందజేశారు.
చిన్నారులు పాల్గొన్న కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
పూల అందాలు, సంప్రదాయ పాటలు, కుటుంబ సభ్యుల సందడి, చిన్నారుల కోలాటాలతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.
బతుకమ్మతో సాంస్కృతిక వారధి.. సేవతో సామాజిక బాధ్యత
FNCA మలేషియా అధ్యక్షుడు కృష్ణ ముత్తినేని స్వాగత ప్రసంగంలో బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, భారతీయ ప్రవాసుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు, మలేషియాలో నివసిస్తున్న లేదా పనిచేస్తున్న భారతీయులు ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు వారికి సహాయం అందించడం FNCA ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆయన తెలిపారు. అవసరంలో ఉన్న భారతీయులకు సరైన మార్గదర్శకత్వం అందించడం, వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారిక వ్యవస్థలతో సమన్వయం చేయడం తమ సంస్థ సామాజిక బాధ్యతలో భాగమని వివరించారు.
మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్ 2.0పై అవగాహన
ఈ సందర్భంగా మలేషియా ప్రభుత్వం అమలు చేస్తున్న మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్ (PRM) 2.0 గురించి కూడా FNCA ప్రతినిధులు అవగాహన కల్పించారు. ఈ పథకానికి సంబంధించిన గడువు 2027 మే 31 వరకు పొడిగించబడినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దీనివల్ల వీసా గడువు ముగిసిన లేదా సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేని అర్హులైన వలసదారులకు తమ సమస్యలను అధికారిక విధానాల ద్వారా పరిష్కరించుకుని స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అవకాశం లభిస్తుందని వివరించారు.
ఈ పథకానికి సంబంధించి FNCA ప్రతినిధులు వెల్లడించిన ముఖ్యాంశాలు:
స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఈ పథకం కింద 500 మలేషియా రింగిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు ఉన్నవారు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి, వారంలోపు ప్రయాణానికి విమాన టికెట్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.
పాస్‌పోర్టు లేనివారు భారత హైకమిషన్‌ను సంప్రదించి ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ పొందేందుకు అవసరమైన మార్గదర్శకత్వం తీసుకోవాలని పేర్కొన్నారు.
అయితే, ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, చెల్లింపులు, గడువులు, ప్రయాణ నిబంధనలను సంబంధిత మలేషియా ఇమ్మిగ్రేషన్ అధికారులు, భారత హైకమిషన్ ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు.
స్పాన్సర్లు, నిర్వాహకులకు కృతజ్ఞతలు
బతుకమ్మ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన స్పాన్సర్లు, స్వచ్ఛంద సేవకులు, కోర్ కమిటీ సభ్యులకు కృష్ణ ముత్తినేని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సెంట్రల్ స్పైస్, అక్షయా గ్రూప్, టూట్కర్ సొల్యూషన్స్, రెడ్వేవ్ సొల్యూషన్స్, స్ప్రౌట్ అకాడమీ, జాస్ బెలూన్స్ డెకరేటర్స్ అండ్ ట్రీట్స్, ఎక్ససాఫ్ట్, జెన్టాక్ట్ సోలుషన్స్ , బీబా మలేషియా, క్వాడ్ ఫిక్స్, ఆర్బయేట్, అతిథి ఎన్నారై కేర్, ఐడియా లాజిక్, నోవా ఇంటర్నేషనల్ స్కూల్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, వైఎస్సార్సీపీ ఎన్నారై వింగ్ మలేషియా, ఎన్నారై టీడీపీ మలేషియా, ఐసీస్ టెక్, రాపిన్నో టెక్నాలజీస్ ,గిజ రెస్టారెంట్,టి ఎస్ ఆర్ టెక్ సోలుషన్స్ తదితర సంస్థలు సహకారం అందించాయి.
FNCA కార్యవర్గ సభ్యుల భాగస్వామ్యం
ఈ వేడుకల్లో FNCA మలేషియా అధ్యక్షుడు కృష్ణ ముత్తినేని, కార్యనిర్వాహక అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక, సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజశేఖర్ రావు గునుగంటి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సాయి కృష్ణ జులూరి, యువజన విభాగం అధ్యక్షుడు ఫణీంద్ర కనుగంటి, యువజన విభాగం ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ ఆదిమూలం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి పాల్గొన్నారు.
అలాగే కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, సురేష్ రెడ్డి మందడి, విజయ్ కుమార్ మాడిశెట్టి, మంగపతి గోరుముచు, సతీష్ రావు కథేరగండ్ల, సందీప్ కుమార్ మర్రు, రూప్ కుమార్ కంచర్ల, సతీష్, గుండ్లకుంట మహేష్ బాబు, సత్య, హరీష్, శరత్, సూర్యకుమారి, మౌనిక కథేరగండ్ల, సుజాత చెన్నుపాటి, వనిత ముత్తినేని, శిరీష కొత్తమాసు, భార్గవి ఆదిమూలం తదితరులు పాల్గొని వేడుకల విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు.
ప్రవాస గడ్డపై తెలుగుసంస్కృతి వైభవం
మొత్తంగా, మలేషియాలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు కేవలం పండుగ సంబరాలకే పరిమితం కాకుండా, తెలుగు ప్రజల ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు, సామాజిక సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాయి. పూల పండుగ అందించిన ఆనందం, ఆత్మీయత, సంప్రదాయాల పరిమళం ప్రవాస తెలుగు కుటుంబాల్లో చిరస్మరణీయ అనుభూతిని నింపాయి. విదేశీ గడ్డపై తెలుగు సంస్కృతిని భావితరాలకు చేరవేయాలన్న సంకల్పంతో FNCA నిర్వహించిన ఈ వేడుకలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.








