భగ్గుమన్న క్రూడాయిల్ ధర..ఆందోళనలో ప్రపంచదేశాలు..!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర మరోసారి భగ్గుమంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగియకపోవడంతో.. చమురు సరఫరాపై ఆందోళనలను పెంచుతున్నాయి. సరఫరా సమస్యలు త్వరలో తీరతాయన్న ఆశలు సన్నగిల్లడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 110 డాలర్లకు చేరువైంది. మే నెల తర్వాత ఈ స్థాయిని తాకడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు చమురు సరఫరాపై ఆందోళనలను పెంచుతున్నాయి.
దీంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 109.69 డాలర్లకు చేరింది. గత ముగింపుతో పోలిస్తే ఇది 3.56 శాతం అధికం. అంతర్జాతీయంగా సరఫరా పరిస్థితులు బలహీనంగా ఉండటంతో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలతో ట్రేడర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.
సౌదీ అరేబియాపై ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేసుకుంటున్నాయి. రష్యాలోని ర్యాజాన్ చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలతో అక్కడ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు సమాచారం. ఈ పరిణామాలు చమురు సరఫరాపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
రష్యా నిల్వల నుంచి వందల మిలియన్ల బ్యారెళ్ల డీజిల్ కొనుగోలుకు ప్రతిపాదించిన ఒప్పందాన్ని అడ్డుకునేందుకు అమెరికా చట్టసభ సభ్యులు శుక్రవారం బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ఒప్పందం రష్యా యుద్ధానికి ఆర్థికంగా తోడ్పడుతుందన్న ఆందోళనను వారు వ్యక్తం చేశారు. మరోవైపు, నవంబర్ 3 ఎన్నికల తర్వాత ఇరాన్పై ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ వినియోగించే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చలేదని సమాచారం.
2026 డిసెంబరులో బ్రెంట్ క్రూడ్ ధర 90 డాలర్లకు చేరవచ్చని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. గతంలో వేసిన 85 డాలర్ల అంచనాను పెంచింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి చివర్లో బ్రెంట్ ధర సుమారు 70 డాలర్లుగా ఉంది. హర్మూజ్ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో అది 125 డాలర్లకు పైగా ఎగసింది. ఆ తర్వాత తగ్గిన ధరలు ఇప్పుడు మళ్లీ 110 డాలర్ల స్థాయికి చేరువయ్యాయి.








