భారత్ లో స్టార్ లింక్ సేవలు ప్రారంభించేందుకు సిద్ధం.. మస్క్ కీలక ప్రకటన..!
టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ …. కీలక ప్రకటన చేశారు. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ పోటీపై చేసిన ప్రకటనకు స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. రిలయన్స్ ప్రకటనను ‘ఎంతో అభినందిస్తున్నా’ అంటూ ‘ఎక్స్’లో స్పందించారు. భారత మార్కెట్లో స్టార్‌లింక్ ప్రవేశంపై మస్క్, రిలయన్స్ మధ్య ఇటీవల మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
స్టార్‌లింక్ భారత్‌లో ఐదేళ్లకు పైగా ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, టెలికాం ఆపరేటర్లతో కలిసి పనిచేస్తోందని తెలిపింది. భారత వినియోగదారులకు సురక్షితంగా సేవలు అందించేందుకు దేశంలోనే ప్రత్యేక వ్యవస్థలు, గేట్వేలు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వీటికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని పేర్కొంది. భారత్‌కు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
శాటిలైట్ కమ్యూనికేషన్ల రంగంలో స్టార్‌లింక్ సహా అన్ని సంస్థల పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ శుక్రవారం ప్రకటించింది. భారతీయ సంస్థలైనా, విదేశీ కంపెనీలైనా దేశ చట్టాలు, విధానాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. జియో శాటిలైట్ సేవలు కూడా అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపింది.
ఈ పరిణామాలకు ముందు మస్క్.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నారంటూ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. అంబానీని ‘భారత్‌కు అసలైన అధిపతి’ అంటూ వ్యంగ్యంగా సంబోధించారు. స్టార్‌లింక్‌ను భారత మార్కెట్లో పోటీ పడనిస్తారా? అని ప్రశ్నించారు.భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు స్టార్‌లింక్ లైసెన్స్ పొందినప్పటికీ, వాణిజ్యపరంగా సేవలు ప్రారంభించేందుకు భద్రతాపరమైన అనుమతులు సహా మరికొన్ని ప్రభుత్వ ఆమోదాలు రావాల్సి ఉంది.








