అర్థరాత్రి పూట భూమిపై సూర్యుడి వెలుగులు..!
సూర్యకాంతి.. మానవాళి అభ్యున్నతి, జీవనమార్గానికి ఏకైక ఆధారం. అలాంటి సూర్యకాంతి కొన్నిరోజులు భూమిని చేరకుంటే.. ఇక మానవాళితో పాటు సకలజీవరాశి జీవనం ప్రమాదంలో పడుతుంది. అయితే కేవలం పగటిపూట మాత్రమే లభించే సూర్యరశ్మిని.. రాత్రి పూట ప్రసరించగలిగితే.. చాలా పనులు పూర్తవుతాయి. వినూత్న ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. కంపెనీలకు లాభాదాయక మార్గంగా మారుతుంది. అందుకే దీనిపై పరిశోధకులు ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా రాత్రి సమయంలోనూ భూమిపై సూర్యకాంతి ప్రసరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫలితంగా అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఇకపై రాత్రి వేళల్లోనూ భూమిపై సూర్యకాంతిని ప్రసరింపజేసే టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ వినూత్న ప్రాజెక్టు కోసం కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్పేస్ టెక్ సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’తో చేతులు కలిపింది. తమ ప్రయోగాల కోసం స్కైరూట్‌తో రెండు రాకెట్ ప్రయోగాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రకటించింది.
భూమికి సమీప కక్ష్యలో భారీ అద్దాలతో కూడిన ఉపగ్రహాలను ప్రవేశపెట్టి, వాటి ద్వారా సూర్యకాంతిని పరావర్తనం చెందించి, భూమిపై ఎంపిక చేసిన ప్రాంతాలకు పంపించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. సుమారు 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతానికి వెలుగులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాత్రిపూట సహాయక చర్యలకు, సౌర విద్యుత్ కేంద్రాలు ఎక్కువసేపు పనిచేసేలా చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని సంస్థ చెబుతోంది. వెలుతురు తీవ్రతను అవసరానికి అనుగుణంగా మార్చుకునే, ఆపివేసే సౌకర్యం కూడా ఉంటుంది.
స్కైరూట్‌తో భాగస్వామ్యం
ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు స్కైరూట్ ఏరోస్పేస్‌కు చెందిన విక్రమ్ రాకెట్లను ఉపయోగించనున్నారు. ఒప్పందం ప్రకారం మొదటి ప్రయోగం విక్రమ్-1 రాకెట్‌తో, రెండవది అభివృద్ధి దశలో ఉన్న విక్రమ్-1యూ రాకెట్‌తో చేపడతారు. ఈ ఒప్పందంపై స్కైరూట్ సీఈవో పవన్ కుమార్ చందన ‘ఎక్స్’ లో హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాకెట్ ప్రయోగ సామర్థ్యం తక్కువగా ఉందని, స్కైరూట్‌తో భాగస్వామ్యం తమకు ఎంతో కీలకమని రిఫ్లెక్ట్ ఆర్బిటల్ సీఈవో బెన్ నోవాక్ తెలిపారు.
నిజానికి ఇలాంటి ప్రయోగం 1993లోనే రష్యా చేసింది. కానీ నిధుల కొరతతో అది మధ్యలోనే ఆగిపోయింది. కాగా, ఈ ప్రస్తుత ప్రాజెక్టుపై ఖగోళ శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాత్రి ఆకాశంలో కృత్రిమ వెలుగుల వల్ల ఖగోళ పరిశోధనలకు ఆటంకం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్, శాస్త్రవేత్తలు, స్థానిక వర్గాలతో చర్చిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే తమ తొలి ప్రదర్శన ఉపగ్రహం ‘ఎరెండిల్-1’ ప్రయోగానికి అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) నుంచి అనుమతి పొందిందని గుర్తు చేసింది.. ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఇంధన, విపత్తు నిర్వహణ రంగాల్లో సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.








