ఫ్రాన్స్ అల్లర్లకు తోడవుతున్న అమెరికన్ రాడికల్ యూత్..?
ఫ్రాన్స్ అగ్నిగోళంలా మారింది. నిరసనలు దావానలంలా మారి ఫ్రాన్స్ ను తగులబెడుతున్నాయి. భవనాలకు నిప్పుు, షాపింగ్ కాంప్లెక్స్ ల దోపిడీ.. అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. యూత్ లో పెరిగిన ఆందోళనలు…ఈ ఉద్రిక్తతలను ఏమాత్రం తగ్గనివ్వడం లేదు. ప్రభుత్వం నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి ఏమాత్రం ఫలించడం లేదు.
ధరల పెరుగుదల, దుర్భరమైన జీవన వ్యయం వంటి సమస్యలపై నిరసన ప్రదర్శనల (France Protests) సందర్భంగా ఫ్రాన్స్‌లోని సిటీ హాళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలు, వేలాది వాణిజ్య సంస్థలపై ఉద్యమకారులు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూలు విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ అల్లర్లు ఆగట్లేదు. తీవ్రమవుతున్న ఈ ఆందోళనల్లో చేరడానికి అమెరికా నుంచి కొంతమంది యాక్టివిస్టులు, తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు (US Radicals) పారిస్‌కు వెళ్లినట్లు అగ్ర రాజ్యానికి చెందిన మీడియా సంస్థలు సంచలన కథనాలను వెలువరించాయి.
ఇవి కూడా చదవండి
అల్లర్లలో పాల్గొనడానికి మిన్నెసోటా నుంచి ఓ ర్యాపర్ ఇటీవల ఫ్రాన్స్‌కు వెళ్లారు. అంతటితో ఆగకుండా పారిస్‌లో బీభత్సం సృష్టించాలని సోషల్ మీడియా వేదికగా శ్వేత జాతీయులకు పిలుపునిచ్చారు. అమెరికాలోనూ ఇటువంటి నిరసనలు లేవనెత్తాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు అమెరికాకు చెందిన కోడ్ పింక్ అనే సంస్థ ఫ్రాన్స్‌ను ఆదర్శంగా తీసుకొని అగ్ర రాజ్యంలోనూ ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 10 నుంచి 12 మధ్య వాషింగ్టన్లో ‘పన్ను చెల్లింపుదారుల తిరుగుబాటు’ నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఫ్రాన్స్‌లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో వారాంతంలో దేశవ్యాప్తంగా సుమారు 2,500 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దాడుల్లో దాదాపు 1,000 మంది అధికారులు గాయపడినట్లు తెలిపారు. అల్లర్లపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ (Emmanuel Macron) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో నెలకొన్న హింసకు తీవ్రవాద వామపక్ష బృందాలకు చెందిన తిరుగుబాటుదారులు, నేరగాళ్లు కారణమని ఆరోపించారు.








