ఘనంగా ‘టీప్యాడ్’ బతుకమ్మ సంబరాలు.. ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి మాటలు, ఆటలు
గతంలో పదివేల మందితో బతుకమ్మ పండుగ నిర్వహించి విదేశాల్లో ఉంటున్న తెలుగు వారందరినీ ఆకర్షించిన తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(టీప్యాడ్).. ఈ దఫా 15వేల మందితో బతుకమ్మ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలో గల ప్రతిష్ఠాత్మక ‘కొమెరికా సెంటర’ వేదికగా నిర్వహించిన ఈ వేడుకలు ఒక భారీ కన్వెన్షన్ తరహాలో సాగాయి. దాదాపు 15వేల మంది హాజరైన ఈ కార్యక్రమానికి వెయ్యి మందికి పైగా మహిళలు, యువతులు బతుకమ్మ ఆటపాటలతో కొమెరికా సెంటర్కు తెలంగాణ సంప్రదాయ పరిమళాలద్దారు. అనంతరం శాస్త్రోక్తంగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. స్టేడియంలో భారీ బతుకమ్మను ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది. కాగా.. కార్యక్రమంలో భాగంగా మహిషాసురమర్దిని నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.
ఇవి కూడా చదవండి
ఈ వేడుకల్లో భాగంగా తెలుగు సినీ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తనదైన టైమింగ్ పంచులతో అదరగొట్టారు. అమెరికాలో బతుకమ్మను ఘనంగా నిర్వహించడం పట్ల ముగ్ధుడైన ఆయన.. టైమింగ్ పంచులతో, డ్యాన్సులతో ప్రాంగణాన్ని ఉర్రూతలూగించారు. ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య నేతృత్వంలోని ‘ఇన్ఫ్యూజన్ బ్యాండ’ సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమాన్ని ‘టీప్యాడ’ ప్రెసిడెంట్ లక్ష్మి పోరెడ్డి, ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ భారీ వేడుకకు 20 కమిటీలు మూడు నెలలుగా శ్రమించాయని నిర్వాహకులు తెలిపారు.









