షరతులు నెరవేర్చాలి.. తర్వాతే యురేనియం సంగతి మాట్లాడుదామన్న ఇరాన్..!
పశ్చిమాసియాలో ఘర్షణలు ముగియాలంటే ముందుగా అమెరికా విశ్వసనీయంగా వ్యవహరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. సంధిపై ముందుకెళ్లే క్రమంలో తమ షరతులను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌కు ఇరాన్ తేల్చి చెప్పింది. తాము శుద్ధి చేసిన యురేనియాన్ని (Uranium) వేరే దేశానికి తరలించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
‘‘శుద్ధి చేసిన యురేనియంలో ఒక్క గ్రాము కూడా ఇరాన్ నుంచి బయటకు వెళ్లదు. మాకు నమ్మకం కుదిరేలా అమెరికా చర్యలు తీసుకునే వరకు ఎలాంటి చర్చలు ఉండవు. ఇరాన్ విధించిన అన్ని షరతులను నెరవేర్చడంతోనే ఆ చర్చల ప్రక్రియ ప్రారంభం కావాలి’’ అని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహసెన్ రెజాయీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మధ్యవర్తిత్వం కోసం ఇరాన్ వెళ్లిన జనరల్ మునీర్‌కు మొహసెన్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
హర్మూజ్ మూసే ఉంటుంది..
‘‘హర్మూజ్ జలసంధి విషయంలో ఎలాంటి గందరగోళ వైఖరి లేదు. అమెరికా మా షరతులు అంగీకరించేంత వరకు హర్మూజ్ మూసే ఉంటుంది. ఇప్పటికే వెళ్తున్న మార్గాల్లో ఓడలకు సమస్యలు ఎదురవుతాయి. గత హామీలను అమెరికా గౌరవించేవరకు కొత్తగా చర్చలు ఏమీ ఉండవు’’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) ఓ ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు.








