చంపేసినా సరే బంగ్లాదేశ్ కు వెళ్తా.. ! భారత్ కు హసీనా థాంక్యూ నోట్..!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. సొంత దేశానికి వెళ్లేందుకు సంసిద్ధమవుతున్నారు. తాను పరాయి దేశంలో ఆశ్రయం పొందుతుండడం.. తన పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులు, అరెస్టులు, హత్యలు జరుగుతుండడంపై ఆమె పునరాలోచనలో పడ్డారు. ఏది ఏమైనా తాను తిరిగి డిసెంబర్ లో తిరిగి వెళ్లడం ఖాయమన్నారు.
వారు నన్ను చంపేయొచ్చు..
‘‘డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్లే విషయంలో ఎలాంటి మార్పు లేదు. తిరిగి వెళ్తున్నందుకు నాకేం భయం లేదు. వారు నన్ను చంపేయొచ్చు.. హింసించొచ్చు.. అరెస్టు చేయొచ్చు. కానీ వెళ్లడం నా బాధ్యత’’ అని హసీనా (Sheikh Hasina) పునరుద్ఘాటించారు. అయితే డిసెంబర్లో ఏ తేదీన వెళ్తారని విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అలాగే తనపై, తన మద్దతుదారులపై నమోదైన కేసుల విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ప్రస్తుత బంగ్లా ప్రభుత్వాన్ని కోరారు.
భారత్ కు హసీనా థాంక్యూ నోట్..
భారత ప్రభుత్వం, ప్రజలకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కృతజ్ఞతలు తెలియజేశారు. 1975లో మాదిరిగానే తనను ఆదరించారని ఉద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థతో వర్చువల్‌గా మాట్లాడారు.
1975 ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు హసీనా (Sheikh Hasina) జీవితాన్ని పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణల్లో ఆమె తండ్రి (బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్), తల్లి, ముగ్గురు సోదరులు ఇంకా కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో విదేశాల్లో ఉండటం వల్ల హసీనా, ఆమె చిన్న చెల్లెలు రెహానా మాత్రమే బతికి బయటపడ్డారు. నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆమెకు ఆశ్రయం ఇచ్చారు. ఆరు సంవత్సరాల తర్వాత 1981 మేలో బంగ్లాదేశ్‌కు హసీనా తిరిగివెళ్లి.. ఆ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజా ఇంటర్వ్యూలో ఆనాటి పరిస్థితినే గుర్తు చేసుకొన్నారు. ప్రస్తుతం భారత్ కల్పించిన ఆశ్రయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.








