ఉక్రెయిన్ కు స్టార్ లింక్ షాక్ .. ఇంతకూ మస్క్ ప్లానేంటి..?
రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఇంటర్నెట్ సేవలు మందగించడం వెనక రీజన్స్ ఏంటి.. ఇప్పుడిదే అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ అయితే ఆందోళన వ్యక్తం చేశారు కూడా. అయితే ..నెట్వర్క్ వేగాన్ని తగ్గించాల్సిందిగా మస్క్ స్వయంగా ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది. ఈ మేరకు ఇద్దరు అమెరికా అధికారులు, సంబంధిత వర్గాలను ఉటంకించింది. ఈ పరిణామం అమెరికా యంత్రాంగాన్ని అయోమయానికి గురిచేసిననట్లు తెలుస్తోంది.
ఇటీవల రష్యాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) డీజిల్ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలోనే యుద్ధ రంగంలో ఉక్రెయిన్ డ్రోన్లు వేగాన్ని కోల్పోయాయి. అమెరికా మద్దతు సన్నగిల్లడంతో రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ వాడుతున్న స్టార్‌లింక్ కమ్యూనికేషన్ పరికరాలపై మస్క్ (Elon Musk) నియంత్రణలు విధించినట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన అప్పుడు తోసిపుచ్చారు. స్టార్‌షీల్డ్ (సైనిక అవసరాల కోసం ఉపయోగించే స్టార్‌లింక్) అమెరికా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుందని నాడు మస్క్ వివరణ ఇచ్చారు.
స్టార్‌లింక్ (Starlink) సేవల కోత విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే స్పష్టం చేశారు. ‘‘సేవల వేగం విషయంలో మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఉక్రెయిన్ విజయం సాధించాలని మేం కోరుకుంటున్నాం’’ అని వివరణ ఇచ్చారు.








