కాస్మెటిక్ సర్జరీలపై మనసు విప్పిన జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi kapoor) తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. తన రూపంలో వచ్చిన మార్పులు, నటిగా తన జర్నీపై శ్రీదేవి(Sridevi) వ్యక్తం చేసిన అభిప్రాయాల గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాతే తనలో నటిగా ఎదిగే అవకాశాలను శ్రీదేవి గుర్తించారని జాన్వీ వెల్లడించినట్లు సమాచారం. అంతకుముందు తన కూతురు సినిమా రంగంలోకి రావడంపై శ్రీదేవికి అంతగా నమ్మకం ఉండేది కాదని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. ధడక్(Dhadak) సినిమాతో తెరంగేట్రం చేసినప్పటి నుంచి జాన్వీ రూపురేఖల మార్పులపై సోషల్ మీడియాలో తరచూ డిస్కషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా అందం కోసం చేయించుకునే కాస్మెటిక్ ట్రీట్మెంట్ల విషయంలో దాపరికం అవసరం లేదన్నది జాన్వీ అభిప్రాయం. సెలబ్రిటీలను ఆదర్శంగా తీసుకునే యువతులు వారి అందం వెనుక ఉన్న వాస్తవాలను కూడా తెలుసుకోవాలని ఆమె భావిస్తున్నారు. తాను కూడా సోషల్ మీడియా ప్రభావానికి లోనై, ఒకానొక టైమ్ లో అందంగా కనిపించాలనే ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే కాస్మెటిక్ సర్జరీల డెసిషన్ తీసుకునే ముందు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని జాన్వీ సూచించారు. సరైన నిపుణుల సలహా లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదకరమని, ఒక్కోసారి ఆశించిన ఫలితాలకు భిన్నమైన పరిణామాలు ఎదురుకావచ్చని హెచ్చరించారు.







