కాంగ్రెస్లో ‘నామినేటెడ్’ పితలాటకం!
తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టి డిసెంబర్ 7 నాటికి మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్పొరేషన్లు, కమిషన్లు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ ఒక కత్తిమీద సాములా మారింది. అధికారం చేపట్టిన కొత్తలో పదవులు ఆశించి నిరాశ చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వం, పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన కేడర్ నుంచి ఒత్తిడి తీవ్రమవుతున్న వేళ.. నిర్ణయాలు మాత్రం నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. ఒకవైపు పార్టీ సంస్థాగత బలోపేతం, మరోవైపు భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రం.. ఈ రెండింటి సమతూకం కుదరకపోవడమే ఈ రాజకీయ ప్రతిష్టంభనకు ప్రధాన కారణం.
రాష్ట్రంలోని మెజారిటీ కార్పొరేషన్లు, కమిషన్లు ప్రస్తుతం నడిపించే నాయకుడు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 2024లో నియమితులైన పలువురు ఛైర్మన్లు, పాలకమండలి సభ్యుల పదవీకాలం జూలై, ఆగస్టు నెలల్లోనే ముగిసింది. మిగిలిన విభాగాల్లోనూ పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేదు. నెలాఖరుకల్లా కొలిక్కి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలుమార్లు సంకేతాలిచ్చినప్పటికీ, గ్రౌండ్ లెవల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ మధ్య జరిగిన చర్చల్లో దాదాపు 15 కార్పొరేషన్లు, కమిషన్ల ఛైర్మన్లు, సభ్యుల ఎంపికపై ప్రాథమిక అవగాహన కుదిరినప్పటికీ, మిగిలిన కీలక విభాగాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనికితోడు లండన్ వర్సిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ అందుబాటులో లేకపోవడం కూడా ప్రక్రియలో జాప్యానికి కారణంగా కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ నెల 12న లేదా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజైన నవంబరు 19న తొలి విడత నామినేటెడ్ పదవుల జాబితా వెలువడవచ్చనే ప్రచారం బలంగా సాగుతోంది. అయితే నవంబరు 12, 13, 14 తేదీల్లో హెచ్ఐసీసీలో జరిగే ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశాలు ఉన్నందున, వారి రాకను బట్టి తుది భేటీ ఉండనుంది. ఒకవేళ ఇక్కడ కూడా పీటముడి వీడకపోతే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఈ వ్యవహారం వాయిదా పడే ప్రమాదముంది. ఈ దఫా రెన్యూవల్ కేవలం నిర్మలా జగ్గారెడ్డి, ప్రీతమ్, బెల్లయ్యనాయక్, శివసేనారెడ్డి సహా ఆరుగురికి మించి ఉండకపోవచ్చని సమాచారం. మెజారిటీ స్థానాలను కొత్త ముఖాలకే కేటాయించి అసంతృప్తిని చల్లార్చాలని అధిష్ఠానం భావిస్తోంది.
మరోవైపు గవర్నర్ కోటా కింద భర్తీ చేయాల్సిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ప్రక్రియను డిసెంబర్ రెండో లేదా మూడో వారం వరకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పక్కనబెట్టింది. ముందుగా కార్పొరేషన్లను తేల్చి, ఆ తర్వాతే మండలి లెక్కలు తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ నిర్ణయించారు. 2027 మార్చిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీకరణాలు ఈ వాయిదా వెనుక దాగి ఉన్నాయి. ముఖ్యంగా మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం సీఎం సొంత జిల్లాను కలుపుకుని ఉండటంతో అక్కడ పాగా వేయడం ప్రతిష్టాత్మకంగా మారింది.
దీనిని దృష్టిలో ఉంచుకుని గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఇద్దరు బీసీలకు, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే ఫార్ములా తెరపైకి వచ్చింది. బీసీల కోటాలో పద్మశాలీతో పాటు మున్నూరు కాపు లేదా ముదిరాజ్ వర్గానికి చోటు కల్పించాలని యోచిస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీలు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ కూడా ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ వేస్తోంది. మిగిలిన రెండేళ్ల పదవీకాలాన్ని సద్వినియోగం చేసుకుని, రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడాలని చూస్తున్న ఆశావహుల లాబీయింగ్ తారస్థాయికి చేరింది. అసంతృప్తి పెచ్చరిల్లకుండా, అన్ని వర్గాలనూ ఏకతాటిపై నిలపడం నాయకత్వానికి పెను పరీక్షగా మారింది.







