బీజేపీ బిల్లుకు బీఆర్ఎస్ జై.. అసలు వ్యూహం ఇదేనా!?
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన సమీకరణాలకు తెరలేవబోతోందా? ఇన్నాళ్లూ ఉప్పు నిప్పులా వ్యవహరించిన బీఆర్ఎస్, బీజేపీ మధ్య మళ్లీ సయోధ్య కుదురుతోందా? సోమవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది.
కేంద్రం ప్రతిపాదించిన నూతన విధానం ప్రకారం, 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తిని మార్చకుండా రక్షణ కల్పిస్తూ, లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచనున్నారు. దీనివల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24 శాతం వాటా తగ్గకుండా ఉండటమే కాకుండా, తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ రాజ్యసభలో తమ పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై, ముఖ్యంగా ఆర్థిక, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయంటూ పలు బిల్లులపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో పోరాటం చేసింది. అలాంటిది ఇప్పుడు కీలకమైన డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ బాహాటంగా మద్దతు తెలపడం వెనుక లోతైన రాజకీయ కారణాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తెరవెనుక రహస్య ఒప్పందం కుదిరిందనడానికి ఈ మద్దతే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ రెండు పార్టీలు లోపాయికారీగా కలిసి పనిచేశాయని, ఇప్పుడు భవిష్యత్ ఎన్నికల కోసం మళ్లీ దగ్గరవుతున్నాయని విమర్శిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఒంటరి పోరాటం కష్టమనే భావన ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ వర్గాల్లో అంతర్గతంగా ఉందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే, ప్రస్తుతం కేవలం ఒక బిల్లుకు మద్దతు ఇచ్చినంత మాత్రాన అది ఎన్నికల పొత్తుగా మారుతుందని ఇప్పుడే చెప్పలేమని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా, తెలంగాణకు అదనంగా 9 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉన్నప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అయినా వ్యతిరేకించలేదని బీఆర్ఎస్ వర్గాలు సమర్థించుకుంటున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తే తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడ్డారనే అపవాదు వస్తుందనే వ్యూహంతోనే కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, పార్లమెంటు వేదికగా మొదలైన ఈ మద్దతు ప్రక్రియ భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది పూర్తిస్థాయి పొత్తుగా రూపాంతరం చెందుతుందా లేదా కేవలం అంశాల వారీ మద్దతుకే పరిమితమవుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మిగిలింది.







