డ్రగ్స్ పై పోరు పేరుతో కిషన్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్!
హైదరాబాద్ నగర రాజకీయాల్లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తనదైన ముద్రను మరోసారి బలంగా చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు, ఢిల్లీ స్థాయి రాజకీయ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో క్షేత్రస్థాయి కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. అయితే.. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన మూడు రోజుల ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర ద్వారా తన పట్టు ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైన సంకేతాలు పంపారు.
అంబర్పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు సాగిన ఈ పాదయాత్ర కేవలం ఒక సామాజిక అవగాహన కార్యక్రమంగా మాత్రమే కాకుండా, గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కిషన్ రెడ్డి పునరాగమనానికి వేదికగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ యాత్ర జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో అత్యవసర కేంద్ర కేబినెట్ సమావేశం ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతితో ఆయన హైదరాబాద్లోనే ఉండి యాత్రను కొనసాగించారు. పార్టీ అధిష్టానం వద్ద ఆయనకున్న ప్రాధాన్యతకు, స్థానిక కార్యక్రమాల పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మూడు రోజుల పాదయాత్రలో వివిధ రంగాల ప్రముఖుల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సినీ ప్రముఖులతో పాటు, వివిధ మత పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ యాత్రలో అడుగులు వేశారు. కేవలం రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలకే పరిమితం కాకుండా, సమాజంలోని భిన్న వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా నగరంలో తనకున్న వ్యక్తిగత సంబంధాలు, ప్రజాదరణ ఏ స్థాయిలో ఉన్నాయో ఆయన నిరూపించుకున్నారు. యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడాలనే బలమైన సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో ఈ కార్యక్రమం సఫలమైంది.
మరోవైపు ఈ పాదయాత్ర వెనుక బలమైన అంతర్గత రాజకీయ కోణం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ బీజేపీలో ఇటీవల కొందరు నేతలు సొంతంగా యాత్రలు, కార్యక్రమాలతో తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో, కిషన్ రెడ్డి ఈ భారీ ఈవెంట్తో పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలను, ప్రముఖులను కదిలించి, ఒక బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించగల నాయకత్వ పటిమ, మాస్ అప్పీల్ తనకు ఉన్నాయని ఆయన పరోక్షంగా చాటిచెప్పారు.
మొత్తానికి నషా ముక్త్ భారత్ అనే వివాదరహిత, ప్రజాప్రయోజన అంశాన్ని ఎంచుకోవడం ద్వారా కిషన్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వ్యవహరించారు. ఒకవైపు సామాజిక బాధ్యత కలిగిన నాయకుడిగా ప్రజలకు మరింత చేరువవుతూనే, మరోవైపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, రాష్ట్ర బీజేపీ అంతర్గత సమీకరణాల్లో తన నాయకత్వం కీలకమని మరోసారి స్పష్టం చేశారు. ఈ పాదయాత్ర ఇచ్చిన ఉత్సాహం రానున్న రోజుల్లో నగర రాజకీయాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.







