భారత్‌పై పాక్ కొత్త కుట్ర.. సైన్యాన్ని టార్గెట్ చేసిన డీప్‌ఫేక్ గేమ్!
ఒక వీడియో చూస్తాం.. అందులో భారత సైన్యానికి చెందిన ఓ ఉన్నతాధికారి పాకిస్థాన్ సైన్యం మనకంటే బలంగా ఉందని చెబుతున్నట్లు కనిపిస్తుంది. మరో వీడియోలో ఓ మతానికి అన్యాయం జరిగిందని చూపిస్తారు. ఇంకో పోస్టులో దేశంలో ఎక్కడో మసీదులను కూల్చేశారంటూ ప్రచారం చేస్తారు. ఇవన్నీ నిజంగానే జరిగాయా? లేక మనల్ని నమ్మించడానికి ఎవరో కావాలనే సృష్టించిన కథనాలా? ఇప్పుడు భారత భద్రతా సంస్థలను కలవరపెడుతున్నది ఇలాంటి ఆన్లైన్ ప్రచారమే!
పాకిస్థాన్ నుంచి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఓ నెట్‌వర్క్‌ను భారత భద్రత, నిఘా సంస్థలు గుర్తించినట్లు వెల్లడైంది. వేలాది సోషల్ మీడియా ఖాతాలు, భారతీయుల పేర్లతో సృష్టించిన నకిలీ ప్రొఫైల్స్, ఏఐ సాయంతో తయారుచేసిన డీప్‌ఫేక్ వీడియోలు.. ఇలా పక్కా ప్రణాళికతో ఈ ప్రచారం సాగుతున్నట్లు ఓ నివేదికలో పేర్కొన్నారు. భారత సైనిక నాయకత్వంపై ప్రజల్లో అనుమానాలు కలిగించడం, దేశంలో మత, సామాజిక విభేదాలను రెచ్చగొట్టడం ఈ ప్రచారం వెనుక ప్రధాన ఉద్దేశాలుగా కనిపిస్తున్నాయి.
నిజమైన వీడియోలా కనిపిస్తుంది.. కానీ అందులో ఉన్నది అబద్ధమే!
ఈ ప్రచారంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే.. భారత రక్షణ రంగానికి చెందిన కీలక వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్ వీడియోలు తయారుచేయడం. ఉదాహరణకు, భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) పాకిస్థాన్ సైన్యం భూ, వాయు, నౌకాదళం, సైబర్ యుద్ధ సామర్థ్యాల్లో భారత్ కంటే ముందుందని అంగీకరించినట్లు ఓ వీడియోను సృష్టించారు. నిజానికి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఏఐ సాయంతో రూపొందించిన వీడియో చూస్తే మాత్రం నిజంగానే మాట్లాడినట్లు అనిపించేలా ఉంది.
ఇంతటితో ఆగకుండా 2019లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన ప్రసంగాన్ని కూడా మార్పులు చేసి మరో నకిలీ వీడియోను ప్రచారంలోకి తీసుకొచ్చారు. మెక్సికోలో జరిగిన ఓ నేర ఘటనలో సిక్కు రెజిమెంట్‌కు చెందిన అధికారి ఉన్నట్లు చూపించేందుకు సంబంధం లేని వీడియో దృశ్యాలను ఉపయోగించారు. ఇలా అసలు వ్యక్తులు చెప్పని మాటలను చెప్పినట్లుగా, సంబంధం లేని ఘటనలను ఒకదానితో మరొకటి ముడిపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని అధికారులు గుర్తించారు.
మతాల మధ్య చిచ్చు పెట్టేలా మరో ప్రచారం!
కేవలం సైన్యంపై తప్పుడు ప్రచారం చేయడమే కాదు.. దేశంలో ఇప్పటికే సున్నితంగా ఉన్న మత, సామాజిక అంశాలను కూడా ఈ నెట్వర్క్ వదలడం లేదు. జమ్మూ కశ్మీర్, మణిపూర్, పంజాబ్ వంటి ప్రాంతాలతో పాటు కుల వివాదాలు, మతపరమైన సంబంధాలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నట్లు నివేదిక చెబుతోంది.
ఘజియాబాద్‌లో ఐదు మసీదులను కూల్చేశారంటూ, కోల్‌కతాలో ప్రార్థనలు చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపి చంపారంటూ తప్పుడు కథనాలను ప్రచారం చేశారు. ఈ వీడియోలు, పోస్టులు నిజమని నమ్మితే ప్రజల్లో ఆగ్రహం, ఆందోళన పెరగడం సహజం. ఇలాంటి భావోద్వేగాలనే తమ ప్రచారానికి అనుకూలంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ నెల ప్రారంభంలో ఘజియాబాద్ పోలీసులు, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కలిసి చేపట్టిన విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఘజియాబాద్‌కు సంబంధించిన ఏఐ వీడియోల మూలాలను పరిశీలించగా, పాకిస్థాన్‌లోని రావల్పిండి, ఇస్లామాబాద్ ప్రాంతాలకు చెందిన IP అడ్రస్‌లతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
పాత వీడియోలకు కొత్త రంగు.. కొత్త తేదీలు!
ఈ ప్రచారంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. ప్రతిసారీ కొత్త వీడియోలు తయారు చేయాల్సిన అవసరం లేకుండానే పాత ఘటనల వీడియోలను తీసుకుని వాటికి కొత్త కథనాలు జోడిస్తున్నారు. 2022, 2024లో మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్-హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన వాస్తవ ఘటనలకు సంబంధించిన వీడియోలను మళ్లీ బయటకు తీసుకొచ్చి, నవంబర్ 2026లో జరిగినట్లుగా తప్పుడు తేదీలు, క్యాప్షన్లు జోడించి ప్రచారం చేశారు.
దీంతో అప్పట్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు తాజాగా జరిగినట్లుగా కనిపిస్తుంది. పాత వీడియోకు కొత్త వివరణ జోడిస్తే చాలు.. దాన్ని చూసేవారిలో గందరగోళం మొదలవుతుంది. ముఖ్యంగా అసలు విషయం తెలియని వారు ఇలాంటి పోస్టులను నిజమని నమ్మి ఇతరులకు షేర్ చేసే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి
భారతీయుల పేర్లతోనే నకిలీ ఖాతాలు!
ఈ ప్రచారం నమ్మదగినదిగా కనిపించేందుకు మరో ఎత్తుగడను కూడా అనుసరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భారతీయ పేర్లు, కుల గుర్తింపులు, స్థానిక వార్తా పేజీలను పోలిన వివరాలతో సోషల్ మీడియా ఖాతాలను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు ‘అనుషి తివారీ’ అనే పేరుతో ఉన్న గుర్తింపును ఉపయోగించి @annu2030, @cutegirlindia21 వంటి X ఖాతాల ద్వారా పోస్టులు చేస్తున్నట్లు దర్యాప్తులో ప్రస్తావించారు.
ఈ ఖాతాలు ఒకసారి కశ్మీర్ అంశంపై పోస్టులు పెడితే, మరోసారి పంజాబ్ లేదా మణిపూర్ గురించి ప్రచారం చేస్తాయి. ఇంకొన్నిసార్లు మతపరమైన వివాదాలపై దృష్టి పెడతాయి. ఇలా ఒక్కోసారి ఒక్కో అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో పాకిస్థాన్ మీడియా సంస్థలు కూడా ఈ పోస్టులను తిరిగి ప్రచారం చేయడంతో, అవి వేర్వేరు వర్గాల నుంచి వచ్చిన నిజమైన సమాచారంలా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
ISPR ప్రమేయం ఉందా?
ఈ మొత్తం వ్యవస్థీకృత ప్రచారం వెనుక పాకిస్థాన్ సైనిక మీడియా విభాగమైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) హస్తం ఉండొచ్చని భారత భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి. సుమారు 2015 నుంచి ఇంటర్న్‌షిప్ తరహా కార్యక్రమాల పేరుతో యువతను ఇలాంటి ఆన్లైన్ ప్రచార కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ నకిలీ ఖాతాలన్నింటికీ ISPRతో ప్రత్యక్ష సంబంధం ఉందనే విషయం మాత్రం ఇప్పటివరకు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.
ఒక ఖాతాను బ్లాక్ చేస్తే.. మరో కొత్త ఖాతా!
ఇలాంటి ప్రచారాన్ని అడ్డుకోవడం కూడా భద్రతా సంస్థలకు సవాలుగా మారుతోంది. తప్పుడు పోస్టులు పెడుతున్న ఖాతాలను గుర్తించి బ్లాక్ చేస్తున్నా, వాటి స్థానంలో వెంటనే కొత్త ఖాతాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో కేవలం ఖాతాలను తొలగిస్తే సరిపోదని, తప్పుడు సమాచారం వైరల్ కాకముందే గుర్తించి ప్రజలకు అసలు విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







