నిరుద్యోగ యువతపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్!
గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సమగ్ర సర్వే చేపట్టాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామాలలో సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యంగా 18 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న నిరుద్యోగ యువత వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ డేటా బేస్ ద్వారా భవిష్యత్తులో ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనై సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజకీయంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నిరుద్యోగ వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సర్వేను ఒక అస్త్రంగా మలుచుకుంటోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.., ప్రతీ గ్రామం నుంచి నిరుద్యోగుల పేర్లు, విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలను సేకరించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య బలమైన అనుసంధానాన్ని పెంచుకోవాలని చూస్తోంది. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు ఈ సర్వే బాధ్యతలను అప్పగించడం ద్వారా పకడ్బందీగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ సర్వే ఆధారంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు నిమిత్తం ఈ పథకం కింద రూ. 50,000 నుంచి రూ. 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించనున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్న ఈ పథకాన్ని నవంబర్ 19న లాంఛనంగా ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఆర్థిక సహాయాన్ని అర్హులైన నిజమైన లబ్ధిదారులకు చేరవేయడంలో ఈ కొత్త సర్వే డేటాబేస్ ప్రభుత్వానికి అత్యంత కీలకం కానుంది.
ఇవి కూడా చదవండి
కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీదే కాకుండా, గ్రామీణ యువత ప్రైవేట్ రంగంలోని అవకాశాలను కూడా ఒడిసిపట్టుకోవాలనేది రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధాన ఆలోచనగా ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సంస్థలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, గ్రామీణ యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. ఈ సర్వే కేవలం ఒక సాధారణ గణన మాత్రమే కాదు. గ్రామీణ ఓటర్లు, యువతను ఆకట్టుకోవడంతో పాటు, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలమనే బలమైన రాజకీయ సంకేతాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చర్య ద్వారా పంపిస్తోంది. మరి ఈ పథకాలు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయనేది వేచి చూడాలి.








