ఏపీలో పెట్టుబడుల జోరు.. చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) కీలక సమావేశం జరిగింది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను త్వరితగతిన పట్టాలెక్కించడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, పి.నారాయణ, కందుల దుర్గేష్‌లు వర్చువల్ విధానం ద్వారా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కేవలం ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవడమే కాకుండా, గత ఒప్పందాలన్నీ వాస్తవ పెట్టుబడులుగా మారి, రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన 714 ఒప్పందాలలో, ఇప్పటికే 519 ప్రాజెక్టులకు సంబంధించిన కార్యాచరణ విజయవంతంగా ప్రారంభమైందని ముఖ్యమంత్రికి నివేదించారు.
రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు మరియు అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు వీలుగా.. విశాఖపట్నంలో అత్యాధునిక ‘కన్వెన్షన్ సెంటర్’ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ వేదికగా జరగబోయే పెట్టుబడుల సదస్సులకు ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రధాన వేదికగా నిలవనుందని, దీని ద్వారా ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.








