చంద్రుడిపైకి వెళ్లే దారిలో రాకెట్ లో ఇంధనం అయిపోతే? మస్క్ దగ్గర అదిరిపోయే ప్లాన్!
ఎలాన్ మస్క్ మాత్రం అలాంటి పరిస్థితి రాకుండా అంతరిక్షంలోనే ‘పెట్రోల్ బంక్’ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు! ఈ మేరకు స్పేస్ఎక్స్ 2027లో ఓ సంచలన ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది సక్సెస్ అయితే అంతరిక్ష ప్రయాణాల లెక్కలే మారిపోవచ్చు. అలాగే ఈ ప్రయోగంలో చిన్న పొరపాటు జరిగినా, మస్క్ చంద్రయాత్ర ప్రణాళికే గడువుల పరీక్షలో పడొచ్చు! 2027 ప్రారంభంలో ఈ కీలక ప్రయోగాన్ని చేపట్టేందుకు స్పేస్ఎక్స్ సిద్ధమవుతోంది. ఇంతకీ మస్క్ అమలు చేయబోతున్న ఆ కొత్త ఆలోచన ఏమిటి..దానికి వచ్చే ఇబ్బందులు ఏమిటి, సక్సెస్ అయితే వచ్చే ఫలితం ఏమిటి?
అంతరిక్షంలోనే ఇంధనం నింపుకోవడం.. ఇదీ అసలు ప్లాన్!
భూమి మీద ప్రయాణించేటప్పుడు పెట్రోల్ అయిపోతే బంకుకు వెళ్లి నింపించుకోవచ్చు. కానీ అంతరిక్షంలో అలాంటి సౌకర్యం ఉండదు కదా! అందుకే స్పేస్ఎక్స్ మరో మార్గాన్ని ఎంచుకుంది. రెండు స్టార్‌షిప్ అంతరిక్ష నౌకలను భూమి చుట్టూ తిరిగే కక్ష్యలోకి పంపి, అక్కడ ఒకదానితో మరొకటి అనుసంధానించాలనుకుంటోంది.
ఆ తర్వాత ఒక నౌకలో ఉన్న ఇంధనాన్ని మరో నౌకలోకి బదిలీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలా ప్రయాణం మధ్యలోనే ఇంధనం నింపుకోగలిగితే, చంద్రుడి వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు అవసరమైన ఇంధనాన్ని తీసుకెళ్లడం మరింత సులభమవుతుంది.
స్పేస్ఎక్స్ అధ్యక్షురాలు గ్విన్ షాట్వెల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రయోగాన్ని 2027 ప్రారంభంలో నిర్వహించాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ఇది రెండు నౌకలను అనుసంధానించి ఇంధనం పంపితే సరిపోయే వ్యవహారం కాదు.
అంతరిక్షంలో రెండు భారీ వాహనాలను సరిగ్గా కలపడం, ఇంధనాన్ని సురక్షితంగా బదిలీ చేయడం, ఆ ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధిగమించడం వంటివన్నీ కీలకమే. ఇంత పెద్ద స్థాయిలో ఇంధనాన్ని అంతరిక్షంలో ఒక నౌక నుంచి మరో నౌకకు బదిలీ చేయడం ఇప్పటివరకు నిరూపించని సవాలు కావడంతో ఈ ప్రయోగంపై ఆసక్తి నెలకొంది.
చంద్రుడిపైకి వెళ్లాలంటే ఈ అడ్డంకి దాటాల్సిందేనా!
స్పేస్ఎక్స్ స్టార్‌షిప్‌ను అభివృద్ధి చేయడం వెనుక ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.. నాసా చేపడుతున్న ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములను చంద్రుడి ఉపరితలంపైకి తీసుకెళ్లడం. 2028లో చంద్రుడిపై మనుషులను దింపాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్టార్‌షిప్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.
భూమి నుంచి బయలుదేరడం ఒక ఎత్తయితే, అక్కడి నుంచి చంద్రుడి వరకు ప్రయాణించడానికి సరిపడా ఇంధనాన్ని సమకూర్చుకోవడం మరో ఎత్తు. అందుకే కక్ష్యలోనే ఇంధనం నింపుకునే సాంకేతికత ఈ ప్రణాళికలో కీలకంగా మారింది.
ఈ పరీక్ష విజయవంతమైతే చంద్రుడి ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది. కానీ అంతటితో పని పూర్తయినట్లు కాదు. చంద్రుడిపై సురక్షితంగా దిగడం, అక్కడి నుంచి తిరిగి పైకి లేవడం, వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావడం వంటి సవాళ్లనూ స్టార్‌షిప్ అధిగమించాలి.
అంతేకాదు, నాసాకు చెందిన ఓరియన్ వ్యోమనౌకతో అనుసంధానం అయ్యేలా స్టార్‌షిప్ నమూనాను కూడా సిద్ధం చేయాల్సి ఉంది. ఈ పరీక్షలన్నింటినీ పూర్తి చేసి, నాసా నిర్దేశించిన గడువుకు అనుగుణంగా సిద్ధం కావడం స్పేస్ఎక్స్కు పెద్ద పరీక్షే.
ఇవి కూడా చదవండి
రాకెట్‌ను మళ్లీ మళ్లీ వాడుకోవాలన్న మస్క్ లక్ష్యం!
స్టార్‌షిప్ విషయంలో ఎలాన్ మస్క్ ఆలోచన చంద్రుడి దగ్గరితో ఆగిపోవడం లేదు. ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి భూమికి తీసుకొచ్చి, తక్కువ సమయంలోనే మళ్లీ ప్రయోగించగలిగితే అంతరిక్ష ప్రయాణాల ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చన్నది ఆయన లక్ష్యం. అందుకే స్టార్‌షిప్‌లోని రెండు ప్రధాన భాగాలనూ తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది స్పేస్ఎక్స్.
అక్టోబర్ 20న జరిగిన కంపెనీ ఆదాయాల సమావేశంలో మస్క్ మాట్లాడుతూ, తదుపరి స్టార్‌షిప్ పరీక్షలో సూపర్ హెవీ బూస్టర్‌తో పాటు స్టార్‌షిప్ వ్యోమనౌకను కూడా తిరిగి లాంచ్‌ప్యాడ్ వద్దకు తీసుకొచ్చి, లాంచ్ టవర్‌కు అమర్చిన భారీ యాంత్రిక చేతులతో పట్టుకునే ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రయోగాన్ని నవంబర్‌లో చేపట్టాలని అప్పటికి ప్రణాళిక ఉంది. రాకెట్‌లోని రెండు భాగాలనూ తిరిగి పట్టుకుని, వాటిని మళ్లీ ప్రయోగించగలిగితే స్టార్‌షిప్‌ను పూర్తిస్థాయిలో పునర్వినియోగించే దిశగా పెద్ద ముందడుగు పడుతుంది.
మస్క్ అంచనా ప్రకారం, 2027 మొదటి అర్ధభాగంలో స్టార్‌షిప్ వారానికి ఒకసారి ప్రయాణించే స్థాయికి చేరుకోవచ్చు. అదే ఏడాది రెండో అర్ధభాగంలో వారానికి రెండుసార్లు ప్రయోగాలు నిర్వహించే లక్ష్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే, గతంలోనూ స్టార్‌షిప్‌కు సంబంధించి ప్రకటించిన కొన్ని గడువులు మారిన నేపథ్యంలో ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.
నాసా గడువు దగ్గరపడుతోంది.. సమయానికి సిద్ధమవుతుందా?
చంద్రుడిపై మనుషులను దింపాలన్న నాసా ప్రణాళికలో స్పేస్ఎక్స్ పాత్ర కీలకం కావడంతో స్టార్‌షిప్ అభివృద్ధిలో జరిగే ప్రతి ఆలస్యం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నలుగురు వ్యోమగాములను భూమికి సమీపంలోని కక్ష్యకు తీసుకెళ్లి, స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్ అభివృద్ధి చేస్తున్న ల్యాండర్లతో అనుసంధాన ప్రక్రియలను పరీక్షించాలని ప్రణాళిక ఉంది. ఈ దశలో విజయవంతమైతేనే చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే తదుపరి ప్రయత్నాలకు అవసరమైన సన్నాహాలు పూర్తవుతాయి.
మస్క్‌కు వ్యాపార లెక్కలూ ఉన్నాయి!
స్టార్‌షిప్ అభివృద్ధి వెనుక అంతరిక్ష పరిశోధనతో పాటు భారీ వ్యాపార అవకాశాలు కూడా ఉన్నాయి. నాసా కోసం చంద్రుడిపైకి వ్యోమగాములను తీసుకెళ్లే ల్యాండర్‌ను అభివృద్ధి చేసేందుకు స్పేస్ఎక్స్కు సుమారు 430 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలు ఉన్నాయి.
మరోవైపు, స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించడం, భవిష్యత్తులో అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వంటి రంగాల్లో స్పేస్ఎక్స్కు పెద్ద వ్యాపార అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే స్టార్‌షిప్ విజయవంతమైతే చంద్రయానం, భవిష్యత్తులో అంగారక గ్రహ ప్రయాణాలు మాత్రమే కాకుండా, అంతరిక్షాన్ని వ్యాపారపరంగా ఉపయోగించుకునే అవకాశాలూ విస్తరిస్తాయి.
మొత్తానికి, 2027 ప్రారంభంలో చేపట్టాలని భావిస్తున్న ఇంధన బదిలీ ప్రయోగం స్టార్‌షిప్ భవిష్యత్తుకు కీలకమైన మలుపు కానుంది. రెండు అంతరిక్ష నౌకలను కక్ష్యలో అనుసంధానించి, ఒకదాని నుంచి మరొకదానికి ఇంధనాన్ని సురక్షితంగా బదిలీ చేయగలిగితే చంద్రుడిపై మనుషులను దింపే ప్రణాళికకు పెద్ద ఊతం లభిస్తుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








