SRI: తెలంగాణలో 88 లక్షలకు పైగా ఓట్లు ఔట్!?
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఈ ప్రక్రియపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు రావడంతో.. ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే.. ఎస్ఐఆర్ వల్ల దాదాపు 26 శాతం మేర ఓటర్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు మొత్తం ఓటర్ల సంఖ్య 3,38,26,448 ఉండగా, తాజాగా అక్టోబర్ 21 నాటికి ఈ సంఖ్య 2,49,85,204కి పడిపోయింది. అంటే దాదాపు 88,41,244 మంది ఓటర్లు (26.14 శాతం) తగ్గిపోవచ్చని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఓటరు వివరాల్లో తప్పులు, అసంపూర్ణ సమాచారం, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ సరిపోలని సుమారు 92,88,188 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు ఎన్నికల అధికారులు 83,03,355 మందిని క్లియర్ చేశారు. మరో 9.6 లక్షల కేసులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉంది. ఒకవేళ పెండింగ్లో ఉన్న ఆ 9.6 లక్షల మంది ఓటర్లను కూడా క్లియర్ చేసినప్పటికీ, తుది ఓటర్ల సంఖ్య దాదాపు 2.60 కోట్లకు మాత్రమే చేరుకుంటుంది. ఇది గతం కంటే చాలా తక్కువ.
ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సరైన ధృవపత్రాలు సమర్పించలేకపోయిన 30,407 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించారు. వీరిలో 12,718 మంది అనామలీస్ కేటగిరీకి చెందినవారు కాగా, 17,689 మంది అన్మ్యాప్డ్ కేటగిరీకి చెందినవారున్నారు. ఇక నోటీసులు అందుకున్న వారిలో విచారణకు హాజరైన 56,86,890 మంది అనామలీస్ కేటగిరీలో, 26,16,465 మంది అన్మ్యాప్డ్ కేటగిరీలో అవసరమైన పత్రాలు సమర్పించి అర్హత సాధించారు. అయితే, నోటీసులు అందినా విచారణకు హాజరుకాని వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. నోటీసులు అందుకున్న వారిలో 3,02,925 మంది విచారణకు గైర్హాజరు కాగా, రీ-షెడ్యూల్ చేసిన తేదీల్లో కూడా హాజరుకాని వారు మరో 9,699 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మరింత కఠిన చర్యలకు ఉపక్రమించింది. గైర్హాజరైన ఓటర్ల నివాసాలకే నేరుగా అధికారులను పంపి, అవసరమైన పత్రాలను సేకరించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఈ నోటీసుల విచారణ గడువు నవంబర్ 5తో ముగియనుంది. నవంబర్ 9న తుది ఓటరు జాబితాను విడుదల చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి
జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లాలో సరైన పత్రాలు సమర్పించడంలో విఫలమై ఓటర్ల తొలగింపునకు గురవుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ జిల్లాలో ఏకంగా 8,208 మంది అనర్హుల జాబిsతాలో చేరగా, తర్వాతి స్థానాల్లో పెద్దపల్లి (4,424 కేసులు) ఉంది. అత్యల్పంగా ఆదిలాబాద్లో కేవలం 71 కేసులు ఉండగా, రాజన్న సిరిసిల్లలో 167 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 16 వరకు కొత్త ఓటరు నమోదు కోసం మొత్తం 10,45,519 దరఖాస్తులు ఫారమ్ 6 ద్వారా అందగా, వాటిలో 5,12,960 దరఖాస్తులను ఆమోదించారు. నిబంధనలు సరిగా లేక 2,23,416 దరఖాస్తులు తిరస్కరించారు. మరో 3,09,143 దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే, నవంబర్ 9న వెలువడబోయే తుది ఓటరు జాబితా తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని, ఓటింగ్ సరళిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.








