ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి .. వార్నింగ్ ఇచ్చిన పవన్ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సప్ ఛానల్ (WhatsApp Channel) నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎంవో (Deputy CMO) కార్యాలయం వెల్లడించింది. డిప్యూటీ సీఎంవో, ఆంధ్రప్రదేశ్ పేరుతో కొనసాగుతున్న ఆ ఛానల్‌కు తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కార్యాలయం గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ఈ నకిలీ ఛానల్ ద్వారా తప్పుడు సమాచారాన్ని, సంబంధం లేని కంటెంట్ (Content)ను ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నకిలీ వాట్సప్ ఛానల్‌ను నమ్మొద్దని, అందులోని సమాచారాన్ని అనుసరించవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ (Forward) చేయవద్దని ప్రజలకు సూచించింది. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.








