మన ఫేస్బుక్ డేటాతో ట్రంప్ గెలిచారా? మెటా మెడకు ఉచ్చు.. రూ.2.37 లక్షల కోట్ల జరిమానా!
మీ ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి ఏదైనా పోస్ట్ చూస్తారు.. ఓ వీడియోకు లైక్ కొడతారు.. ఒక రాజకీయ నాయకుడి గురించి సెర్చ్ చేస్తారు. కానీ మీరు చేసే ఈ చిన్న చిన్న పనులే.. మీ రాజకీయ ఆలోచనలను అంచనా వేసే ఆయుధాలుగా మారితే? మీకు తెలియకుండానే మీ ఓటును ప్రభావితం చేసే ప్రయత్నం జరిగితే?
ఇప్పుడు ఈ ప్రశ్నలే ఫేస్బుక్ వంటి టెక్ దిగ్గజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచాన్ని కుదిపేసిన ఓ పాత వివాదం.. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి పరిణామం ఎంత తీవ్రమంటే.. వార్తల్లో వినిపిస్తున్న మొత్తం చూస్తేనే కళ్లు తిరిగే పరిస్థితి! ఇంతకీ ఏం జరిగింది? అసలు ఈ కథలో దాగి ఉన్న మెలిక ఏంటి?
ట్రంప్ ఎన్నికల ప్రచారం.. కోట్లాది మంది డేటా!
2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయం. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంలో కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ పేరు ప్రధానంగా వినిపించింది.
అసలు వివాదం ఏమిటంటే..
ఫేస్బుక్లో మనం ఏం చూస్తున్నాం, ఎలాంటి విషయాలపై ఆసక్తి చూపిస్తున్నాం, ఏ పోస్టులకు స్పందిస్తున్నాం వంటి సమాచారాన్ని విశ్లేషిస్తే మన అభిరుచుల గురించి అంచనా వేయవచ్చు. ఈ సమాచారాన్ని ఉపయోగించి ఎవరికైనా నచ్చే రాజకీయ సందేశాలను ప్రత్యేకంగా చూపించే అవకాశం ఉంటుంది.
కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ థర్డ్‌పార్టీ యాప్ ద్వారా దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ ట్రంప్ 2016 ఎన్నికల ప్రచారానికి పనిచేసింది. అయితే, ఈ డేటా ఎంతమంది ఓటర్ల నిర్ణయాలను మార్చిందన్నది తేలాల్సిన విషయం.
అసలు తప్పు ఎక్కడ జరిగింది?
వినియోగదారుల సమాచారాన్ని ఎవరు చూడగలరు? ఏ అవసరానికి ఉపయోగించగలరు? దాన్ని రక్షించడానికి కంపెనీ ఏం చేస్తోంది? ఈ విషయాలపై ఫేస్బుక్ ప్రజలకు తప్పుడు భరోసా ఇచ్చిందన్నది న్యూ మెక్సికో రాష్ట్రం చేసిన ప్రధాన ఆరోపణ.
ఉదాహరణకు, మీరు ఒక యాప్‌కు మీ ఫేస్బుక్ సమాచారాన్ని యాక్సెస్ చేసే అనుమతి ఇచ్చారనుకుందాం. ఆ యాప్ మీ సమాచారాన్ని మాత్రమే కాకుండా, మీకు తెలియని ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించే పరిస్థితి వస్తే? మీ సమాచారం ఎక్కడికి వెళ్తోంది, దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు అనే విషయాలు మీకు స్పష్టంగా తెలియాలి. ఈ కేసులోనూ వినియోగదారుల సమాచారంపై మెటా ఇచ్చిన భరోసాలు, వాస్తవంగా అనుసరించిన విధానాల మధ్య తేడాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.
ఈ వ్యవహారంపై న్యూ మెక్సికో అటార్నీ జనరల్ 2021లో మెటాపై కేసు వేశారు. కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదంతోపాటు, తప్పుడు సమాచారం, ద్వేషపూరిత కంటెంట్‌ను నియంత్రించడంలో కంపెనీ వ్యవహరించిన తీరుపైనా ప్రశ్నలు లేవనెత్తారు.
అయితే, మెటా ఈ ఆరోపణలను అంగీకరించలేదు. వినియోగదారుల సమాచారాన్ని తాము విక్రయించలేదని, రాష్ట్రం చేసిన ఆరోపణలు తమ విధానాలను సరిగ్గా ప్రతిబింబించడం లేదని వాదించింది.
4.39 కోట్ల ఉల్లంఘనలు.. జరిమానా ఎలా లెక్కించారు?
ఈ కేసులో సెప్టెంబర్ 25న జ్యూరీ కీలక నిర్ణయం తీసుకుంది. మెటా, దాని నాయకత్వం చేసిన 29 ప్రకటనల్లో 26 వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని గుర్తించింది. న్యూ మెక్సికో వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని 43,899,725 సందర్భాల్లో ఉల్లంఘించినట్లు నిర్ధారించింది.
రాష్ట్ర చట్టం ప్రకారం ఒక్కో ఉల్లంఘనకు గరిష్ఠంగా 5,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఇది ఒక్కో ఉల్లంఘనకు సుమారు రూ.4.74 లక్షలు. ఈ లెక్కల ప్రకారం జరిమానా మొత్తం వందల బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఏర్పడింది.
రాష్ట్రం తరఫు న్యాయవాదులు 35 బిలియన్ నుంచి 40 బిలియన్ డాలర్ల వరకు జరిమానా కోరగా, మెటా దాన్ని 3.45 బిలియన్ డాలర్లకు పరిమితం చేయాలని వాదించింది. చివరకు న్యాయమూర్తి ఫ్రాన్సిస్ మాథ్యూ అక్టోబర్ 21న మెటాకు 25 బిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ ఆదేశించారు. 25 బిలియన్ డాలర్లు: సుమారు రూ.2,36,800 కోట్లు అంటే రూ.2.37 లక్షల కోట్లు.
ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది?
న్యూ మెక్సికో రాష్ట్ర అటార్నీ జనరల్ రౌల్ టొరెజ్ ప్రకారం, జరిమానా ద్వారా వచ్చే మొత్తాన్ని రాష్ట్రంలోని పాఠశాల వ్యవస్థకు కేటాయించనున్నారు.
మెటాకు ఇలాంటి కేసులు కొత్త కాదు!
మెటా ఇప్పటికే కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదానికి సంబంధించి అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు 5 బిలియన్ డాలర్లు, అంటే అప్పటి మారకపు విలువను బట్టి సుమారు రూ.35,000 కోట్లకు పైగా జరిమానా చెల్లించేందుకు 2019లో అంగీకరించింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








