దేవీ నవరాత్రులు, దసరా పండగ నన్ను ఎంతో ప్రభావితం చేస్తుంది : సెనేటర్ కోరీ బుకర్
ప్రపంచ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటున్న భారతీయులకు, అలాగే న్యూజెర్సీ ఏరియాలో దసరా జరుపుకుంటున్న భారతీయులకు యూఎస్ సెనేటర్ కోరీ బుకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దసరా, దేవీ నవరాత్రులతో తనకున్న సంబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు.
న్యూజెర్సీ ఏరియాలో తాను ప్రయాణించే సమయంలో సరిగ్గా ఈ సమయానికే ప్రతి యేడాది కూడా నవరాత్రులు, దసరా సందర్భం తనకు గుర్తుకు వస్తుందన్నారు. న్యూజెర్సీ ఏరియాలోని ప్రతి మూలా, జెర్సీ సిటీ వీధుల్లో వేడుకలైనా, ఎలిజబెత్ లేదా చెర్రి హిల్‌లోని పాఠశాల జిమ్నాసియంలైనా, పార్సిప్పానీ మరియు అనేక ఇతర ప్రాంతాలలోని ఆలయాలైనా, పదివేల మంది కమ్యూనిటీ సభ్యులు ఒకరితో ఒకరు ఏకతాటిపై గర్భా నృత్యం చేయడం చూసి నేను మంత్రముగ్ధుడిని కాకుండా ఉండలేనని చెప్పుకొచ్చారు. అలాగే గర్భా ఆడుతున్న సమయంలో మహిళలు గుంపుగా చేరి, ఓ సర్కిల్ లో అందంగా రంగురంగుల కుర్తాలతో ఆడుతుంటారని, అలాగే దాండియా ఆడుతున్న సమయంలో లయబద్ధమైన చప్పుళ్లతో, అడుగులతో ఆడుతుంటారని, ఎన్నో సంవత్సరాలుగా సమాజంలో పాతుకుపోయిన ఓ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చారు.
చెడుపై మంచి సాధించిన విజయం, శక్తిని ఆరాధించడం, ధైర్యం, విశ్వాసం, ధర్మాచరణ ద్వారా చీకటిని, కష్టాలను అధిగమించవచ్చనే నమ్మకం నవరాత్రికి సంబంధించిన ప్రధాన అంశాలని, ఇవి తన మనసును ఎంతగానో ప్రభావితం చేస్తాయని సెనేటర్ బుకర్ చెప్పుకొచ్చారు. క్లుప్తంగా చెప్పాలంటే, ద్వేషం, భయం మరియు విభజన కలిగించే శక్తుల కంటే మంచి, ధైర్యం మరియు కరుణతో కూడిన శక్తులు ఎంతో బలమైనవని నవరాత్రి వేడుకలు మనకు గుర్తుచేస్తాయన్నారు.
అచ్చు ఈ విలువలనే తాను కూడా బలంగా నమ్ముతానని, అమెరికా సెనేట్‌లో తాను ప్రతిరోజూ చేస్తున్న పోరాటానికి ఇవే మూల సూత్రాలు అని నేను నమ్ముతానని ప్రకటించారు.అందుకే, ఈ ప్రాథమిక విశ్వాసాలకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి తాను గర్వపడుతుంటానని అన్నారు. దురదృష్టవశాత్తూ, చీకటి, ద్వేషానికి వ్యతిరేకంగా సాగే పోరాటం మన సమాజాల్లో ప్రతిరోజూ జరుగుతూనే ఉంటుందని, వాషింగ్టన్ డి.సి.లోని అమెరికా సెనేట్ ప్రాంగణంలోనైనా, లేదా దేశవ్యాప్తంగా తాను పర్యటించేటప్పుడు కలిసే ప్రజల మధ్యనైనా ఈ పోరాటాన్ని తాను ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నానని తెలిపారు.
ప్రజలు వారి వారి నిత్య జీవితాల్లో కూడా ఈ పరిణామాలను గమనిస్తూ వుంటారని కచ్చితంగా భావిస్తున్నానని అన్నారు. మీరు ఐసెలిన్లోని ఓక్ ట్రీ రోడ్లో మీ కుటుంబాలతో కలిసి భోజనానికి వెళ్లినా, జెర్సీ సిటీలోని ఇండియన్ బజార్లో గానీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పటేల్ బ్రదర్స్‌లో గానీ కిరాణా సామాను కొనుగోలు చేసినా, లేదా ఇటీవల మీ కారుకు గ్యాస్ నింపుకున్నా, డొనాల్డ్ ట్రంప్ మరియు రిపబ్లికన్ పార్టీ హయాంలోని అనవసరమైన సుంకాలు మరియు ఇరాన్ యుద్ధం కారణంగా మన ప్రాథమిక అవసరాల ధరలు చాలా పెరిగిపోయాయన్నారు.
ఈ క్రూరమైన, అవినీతిమయమైన ప్రభుత్వం మన వలస కుటుంబాల పట్ల చూపిన అమానవీయ ప్రవర్తన వల్ల సమాజంలోని చాలా మంది కూడా గాయపడ్డారని, చట్టబద్ధమైన నివాసితులు, పౌరులను జైలులో పెట్టడం గానీ, దేశవ్యాప్తంగా ఉన్న తమ కుటుంబాలతో చట్టబద్ధంగా కలవడానికి ప్రయత్నిస్తున్న కుటుంబాలను విడదీయడం గానీ, డొనాల్డ్ ట్రంప్ యొక్క ICE మన రాష్ట్రం మరియు సమాజంలోని ఎంతో మంది జీవితాలపై తీవ్ర విధ్వంసం సృష్టించిందన్నారు.
నవరాత్రి మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుందని, మనమందరం కలిసికట్టుగా కృషి చేస్తే, ఈ ద్వేషాన్ని, క్రూరత్వాన్ని మనం జయించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం అలంకారప్రాయమైన మాట కాదని, ఈ నెల ప్రారంభంలో చికాగో శివారు ప్రాంతంలోని ఒక హిందూ దేవాలయంపై సామూహిక కాల్పులకు పథకం పన్నారనే ఘటన, నేటికీ కొనసాగుతున్న భయంకరమైన ద్వేషపూరిత నేరాలను మనకు మరోసారి గుర్తుచేసిందని అన్నారు.
ఈ దుష్ట శక్తులు గ్రహించని విషయం ఏమిటంటే, బలం అనేక రూపాల్లో ఉంటుందని, మన దేశంలోని వైవిధ్యమే మన దేశాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతుందని అన్నారు. మనకున్న విశ్వాసం, సామాజిక స్పృహ, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడటం మరియు అందరం కలిసికట్టుగా ఉండటం వంటి లక్షణాలే మన సమాజంలోని ఈ చీకటిని అధిగమించేలా చేస్తాయని ప్రకటించారు. నవరాత్రులు దసరా పండుగతో ముగిసినట్లుగా, దుర్గాదేవి మహిషాసురుడిపై విజయం సాధించినట్లుగా, శ్రీరాముడు రావణుడిని జయించినట్లుగా… మనం కూడా ఒక సమాజంగా తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
దేవీ నవరాత్రులు, దసరా పండగ అందరిలో స్ఫూర్తి నింపాలని, ధైర్యాన్ని నింపాలని, చెడుపై మంచి విజయం సాధిస్తుందన్న అచంచల విశ్వాసం అందరిలో కలగాలని బుకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజెర్సీలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగలను జరుపుకుంటున్న వారందరికీ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ముగించారు.








