తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం!
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పుడూ ఒక సున్నితమైన అంశమే. అందుకే ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నదీ జలాల పంపకాలు రణరంగాన్ని తలపిస్తూనే ఉన్నాయి. తాజాగా అక్టోబర్ చివరి వారంలో జరగనున్న కృష్ణా (KRMB), గోదావరి (GRMB) నదీ యాజమాన్య బోర్డుల సమావేశాలు మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వాదనలకు, రాజకీయ ఘర్షణకు వేదిక కాబోతున్నాయి. ఇవి కేవలం జల వివాదాలకే పరిమితం కావట్లేదు.. రెండు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును, అధికార, ప్రతిపక్షాల వ్యూహాలను శాసించనున్నాయి.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేవు. డ్యాంలలోకి నీటి ప్రవాహం భారీగా తగ్గింది. ఇది ఇరు రాష్ట్రాలకు సమస్యగా మారింది. ముఖ్యంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి. తాగు, సాగునీటి ఎద్దడి మునుపెన్నడూ లేనంతగా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 26న కృష్ణా బోర్డు సమావేశం, అక్టోబర్ 30న గోదావరి బోర్డు సమావేశం జగనున్నాయి. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎవరి వాటా ఎంత ఉండాలనే అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది.
కృష్ణా బేసిన్లో తమ భూభాగం ఎక్కువగా ఉందని, అందువల్ల నీటి కేటాయింపుల్లో తమకే సింహభాగం దక్కాలని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న పద్ధతికి బదులుగా 70:30 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఏపీ మాత్రం గతంలో మాదిరిగానే 66:34 నిష్పత్తిని కొనసాగించాలని పట్టుబడుతోంది. ఈ భిన్న వాదనల వెనుక రాజకీయ మనుగడ, ప్రాంతీయ ఆకాంక్షలు ముడిపడి ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ప్రజాక్షేత్రంలో బలమైన ముద్ర వేయడానికి ఈ జల వివాదాలను రాజకీయ ఆయుధాలుగా మలుచుకోవడం పరిపాటిగా మారింది.
ఇవి కూడా చదవండి
మరోవైపు.. కేటాయించిన నీటి కన్నా ఏపీయే ఎక్కువ వాటా వాడుకుంటోందని తెలంగాణ ఆరోపిస్తోంది. బోర్డుల ఆదేశాల ప్రకారం నీటి వినియోగాన్ని పారదర్శకంగా అంచనా వేయడానికి టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో ఏపీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తెలంగాణ వాదిస్తోంది. దీనివల్ల తమ హక్కులకు భంగం కలుగుతోందని రాజకీయ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక గోదావరి బోర్డు సమావేశంలోనూ రాజకీయ ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ వల్ల తమ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయనే అంశాన్ని తెలంగాణ గతంలోనూ లేవనెత్తింది. ఈ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించి ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఇలా ఒకరి ప్రాజెక్టులపై మరొకరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, అనుమతులు లేని ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. అక్టోబర్ చివరి వారంలో జరగనున్న ఈ రెండు బోర్డుల సమావేశాలు కేవలం బ్యూరోక్రాటిక్ చర్చలకే పరిమితం అయ్యేలా కనిపించడం లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదురుతుందా.. లేకుంటే ఇప్పటిలాగే ఇరు రాష్ట్రాలు పంతాలకు పోతాయా.. అనేది వేచి చూడాలి.








