ఎమ్మెల్సీ ఎన్నికలు.. 20 ఏళ్ల సెంటిమెంట్ చెరిగిపోతుందా?
తెలంగాణలో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అంతుచిక్కని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడానికి ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ రెండు స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాబోయే స్థానిక సంస్థలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది.
గత 20 ఏళ్లుగా హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఈ స్థానంలో బీజేపి, బీఆర్ఎస్, ఇతర స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి (బీఆర్ఎస్) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానం నుంచి తీన్మార్ మల్లన్న గెలుపొందారు. వీళ్లిద్దరి పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. దీంతో, ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటరు నమోదు ప్రక్రియలో బిజీగా ఉన్నాయి.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డిని, వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ఖరారు చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, విపక్ష బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే ఈ రెండింటిలో పాగా వేయడం ద్వారా అధికార పార్టీకి చెక్ పెట్టాలని ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
ఈ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ నేతలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోనే గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల పరిధిలోని అనేక వార్డులు ఉన్నాయి. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే, అది పట్టణ ప్రాంతాల్లో పార్టీ కేడర్‌కు నైతిక స్థైర్యాన్ని ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
మొత్తంగా చూస్తే.. రెండు దశాబ్దాల సెంటిమెంట్‌ను బద్దలు కొట్టి పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, చైతన్యవంతమైన పట్టభద్ర ఓటర్లను ఆకట్టుకోవడం, ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పకొట్టడం అధికార పార్టీకి కత్తి మీద సాములాంటిదేనని చెప్పాలి.








