డ్రోన్ల పని పట్టేందుకు కొత్తరాడార్లు.. భారత్ చేతికి సరికొత్త అస్త్రాలు..!
సరిహద్దున ఉన్న పాక్, చైనాలతో భారత్.. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. రీసెంట్ గా డ్రోన్లు సరిహద్దుల్లో భారత్ గస్తీకి పెనుసవాళ్లుగా మారాయి. గతంలో మానవ వనరుల ద్వారా ఆయుధాలు, ఇతర వెపన్స్, మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణ చేసిన పాక్.. ఇప్పుడు డ్రోన్ సాయంతో ఆ పనిని మరింత సులభంగా చేయగలుగుతోంది. దీనికి తోడు భారత్ కు చెందిన రక్షణ రహస్యాలను సేకరిస్తోంది. ఫలితంగా దేశ రక్షణ ప్రమాదంలో పడినట్లైంది. దీంతో వాటిని ఎదుర్కోవడంపై భారత్ కూడా ఫోకస్ పెట్టింది.
సరిహద్దుల్లో డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యానికి కొత్త రాడార్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో రూ.770 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంప్రూవ్డ్ లో-లెవల్ లైట్‌వెయిట్ రాడార్ (LLLR-I) వ్యవస్థలను సమకూర్చుకోవడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఈ రాడార్లు సైన్యం వైమానిక రక్షణ సామర్థ్యాన్ని పెంచనున్నాయి.
ఈ రాడార్లతో యుద్ధ విమానాల పరిమాణంలో ఉండే లక్ష్యాలతో పాటు చిన్న, అతి చిన్న డ్రోన్లను గుర్తించి వాటి కదలికలను పర్యవేక్షించవచ్చు. గగనతలంలో గుర్తించిన లక్ష్యాల్లో ఏవి ఎక్కువ ప్రాధాన్యంతో ఎదుర్కోవాలో నిర్ణయించేందుకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీంతో మానవరహిత వైమానిక వ్యవస్థల (యూఏఎస్) నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడంలో సైన్యానికి సహాయం అందనుంది.
దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీని పెంచాలన్న లక్ష్యంలో భాగంగా ఈ కొనుగోలు చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల దేశీయ రక్షణ పరిశ్రమతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) కూడా అవకాశాలు పెరిగే వీలుంది.
గత దశాబ్దంలో భారత్ రక్షణ ఉత్పత్తుల తయారీలో గణనీయమైన వృద్ధిని సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.4,746 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల విలువ 2025-26లో రూ.1.78 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో రక్షణ ఎగుమతులు రూ.686 కోట్ల నుంచి రూ.38,424 కోట్లకు పెరిగాయి. భారత రక్షణ పరికరాలు ప్రస్తుతం 80కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
2029 నాటికి ఏటా రూ.3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తుల తయారీ, రూ.50 వేల కోట్ల ఎగుమతులు సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధికి కేటాయింపులను కూడా పెంచింది. 2026-27లో ఈ కేటాయింపులు రూ.29,100.25 కోట్లకు చేరాయి. పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలు కొత్త రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు పరిశోధన బడ్జెట్లో 25 శాతాన్ని అందుబాటులో ఉంచింది.








