నాకు పులిట్జర్ రావాల్సిందే.. ట్రంప్ లోని రచయిత ఆవేదన..!
నిన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ తెగ ప్రయత్నించారు. అంతేకాదు.. ప్రపంచంలో అందరికీ నోబెల్ ఇస్తున్నారు. 8కి పైగా యుద్ధాలు ఆపిన నాకు మాత్రం ఇవ్వడం లేదని నిష్టూరమాడారు. అయితే .. ట్రంప్ ఎన్ని చెప్పినా.. నోబెల్ జ్యూరీ మాత్రం .. వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. తాము ఎవరికైతే ఇవ్వా లనుకున్నారో వారికే వాటిని ప్రకటించారు. దీంతో ట్రంప్ తెగ ఫీలై పోయారు కూడా. ఇప్పుడు నోబెల్ అయిపోయింది. ఇంతలో ట్రంప్ మరో అవార్డు తనకు రావాల్సిందని పబ్లిగ్గానే వాపోయారు..
పెండిల్టన్లోని టీ.ఈడీ గారిసన్ అరేనాలో జరిగిన సభలో ట్రంప్ మీడియాపై విమర్శలు గుప్పించారు. రష్యా దర్యాప్తునకు సంబంధించిన కథనాలకు పులిట్జర్ అవార్డులు అందుకున్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి కథనాలు తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపించారు. ఆ అవార్డులు అందుకున్నవారికి అవి దక్కాల్సింది కాదని వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదని, పులిట్జర్ కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రచనలకుగానూ తనకు పులిట్జర్ రావాల్సిందని అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రచనా నైపుణ్యంపై ఆయన చేసిన వాదనను ప్రశ్నించారు. ఇంగ్లిష్‌లో ఆయన మాట్లాడే తీరును ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు. పులిట్జర్ కోరుకోవడంపై కొందరు ఎగతాళి చేస్తూ పోస్టులు పెట్టారు.
2026 పులిట్జర్ పురస్కారాల్లో ట్రంప్ ప్రభుత్వం, దాని విధానాలపై వచ్చిన కథనాలకు కూడా గుర్తింపు లభించింది. ఫెడరల్ ప్రభుత్వ విభాగాల్లో మార్పులు, ఉద్యోగాల కోతల ప్రభావంపై కథనాలకుగానూ వాషింగ్టన్ పోస్ట్ అవార్డు అందుకుంది. జెఫ్రీ ఎప్స్టీన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన న్యాయశాఖ ఫైళ్ల విడుదలకు దోహదపడిన పరిశోధనాత్మక కథనాలకు వాల్ స్ట్రీట్ జర్నల్‌కు గుర్తింపు దక్కింది. షికాగోలో ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన కఠిన వలసల నిర్బంధ చర్యలపై కథనాలకు షికాగో ట్రిబ్యూన్‌కు అవార్డు దక్కింది.








