మా అంతర్గతవిషయాలు మీ కెందుకు.. ట్రంప్ కు ఫ్రాన్స్ ఇండైరెక్ట్ కౌంటర్..!
యూరప్ మండిపోతోంది.. ఒక్కో దేశంలో ఒక్కో సమస్యపై యూత్ రోడ్డెక్కుతున్నారు. తమ కోపాన్ని నిరసనాగ్ని రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఫ్రాన్స్ లోఅయితే అది దావానలంలా సాగుతోంది. ప్రభుత్వ దళాలు ఎంతగా అదుపు చేద్దామన్నా అదుపు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అమెరికా అధినేత ట్రంప్ కామెంట్స్.. ఫ్రాన్స్ దేశాధినేతలకు చికాకు తెప్పిస్తున్నాయి. మా సంగతి మేం చూసుకుంటాం కానీ.. మీరు ఆందోళన చెందవద్దన్న రీతిలో అగ్రరాజ్యాధినేతకు .. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కౌంటరిచ్చారు.
ఫ్రాన్స్‌లో ఇటీవల చెలరేగిన హింసాత్మక నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్‌లో నెలకొన్న ఉద్రిక్త సామాజిక వాతావరణాన్ని కొందరు విదేశీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ‘అట్లాంటిక్ అవతలి వైపు ఉన్న నేతలు’ చేస్తున్న వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కానివి, అవివేకమైనవి అని చురకలంటించారు.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న అల్లర్లకు వలసదారులే కారణమని, వెంటనే సరిహద్దులు మూసివేయాలని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.. దీనిపై మాక్రాన్ స్పందిస్తూ.. “కొన్ని విదేశీ శక్తులు మా దేశంలో జరిగిన ఘటనల గురించి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఉన్న కొందరు నేతలు, ఏఐ సృష్టించిన నకిలీ చిత్రాలను, కట్టుకథలను అమాయకంగా నమ్మి మా దేశాన్ని వారి రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇది మాకు అవసరం లేదు” అని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌పై వలసదారులు, ఇస్లామిస్టులు దండెత్తారని వస్తున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు.
అయితే, ఫ్రాన్స్‌లో నిరసనలకు వలసలు కారణం కాదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న జీవన వ్యయం, మెరుగైన పాఠశాల పరిస్థితులు, మరిన్ని ప్రభుత్వ సేవలు కావాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, కార్మిక సంఘాలు ఈ ఆందోళనలు చేపట్టాయి. ఈ నిరసనల్లో వలసల ప్రస్తావనే లేదని నివేదికలు చెబుతున్నాయి.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండేందుకు సంబంధిత దేశాలకు అవసరమైన వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ తెలిపారు. “మా దేశాన్ని విమర్శిస్తున్న వారెవరూ మా దేశాన్ని ప్రేమించేవారు కాదు” అని మ్యాక్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు.








