కుటుంబ సభ్యులతో కేసీఆర్ దసరా వేడుకలు
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Chandrashekhar Rao) దసరా వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి కేసీఆర్ సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. వేద పండితులు సమక్షంలో వాహన పూజ, ఆయుధ పూజలు నిర్వహించారు. అనంతరం శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు.
దసరా వేడుకల్లో కేసీఆర్ తోపాటు కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు రావు పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో నిర్వహించిన పూజలతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ముఖ్యనేతలు కేసీఆర్ నివాసానికి వరుస కట్టారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao), కె.పి.వివేకానంద (K.P. Vivekananda), పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి (Vanteru Pratap Reddy), స్థానిక సంస్థల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.








