పెళ్లికి గెస్ట్ లుగా గేదెలు, సోషల్ మీడియాలో వైరల్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
పెళ్లంటేనే హడావుడి.. అందమైన అలంకరణలు, ఖరీదైన దుస్తులు, బంధుమిత్రుల సందడి. అదే సమయంలో వరుడు ఎలా వచ్చాడు? వధువు ఎంత గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది? బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ పాట ప్లే అయింది? కెమెరా ఎన్ని యాంగిల్స్‌లో తిరిగింది? వీటన్నింటికీ ప్రత్యేక బడ్జెట్. కానీ ఓ వరుడు మాత్రం ఈ లెక్కలన్నింటినీ పక్కనపెట్టి తన పెళ్లికి వచ్చిన అతిథులతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి స్పెషల్ గెస్టులు సెలబ్రిటీలు కాదు.. రాజకీయ నాయకులు కాదు.. ఖరీదైన కార్లలో దిగే VIPలూ కాదు. నేరుగా గేదెలే పెళ్లి మండపంలోకి వచ్చేశాయి!
పెళ్లి మండపంలోకి గేదెల ఎంట్రీ.. వరుడి స్పందన హైలైట్!
రంగురంగుల లైట్లు, అందమైన తెరలతో అలంకరించిన పెళ్లి మండపంలో సంప్రదాయ దుస్తులు, తలపాగా ధరించి వరుడు నిలబడి ఉన్నాడు. ఇంతలో అతడి పెంపుడు గేదెలు అక్కడికి వచ్చాయి. సాధారణంగా పెళ్లి వేడుకల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించడం అరుదు. కానీ ఆ వరుడు మాత్రం వాటిని చూసి ఆశ్చర్యపోకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించాడు.
చుట్టూ బంధువులు, స్నేహితులు, పెళ్లి సందడి ఉన్నప్పటికీ ఆ గేదెలు ప్రశాంతంగా కనిపించాయి. వాటితో వరుడికి ఉన్న అనుబంధాన్ని చూసి అక్కడున్నవారు సైతం చిరునవ్వులు చిందించారు. ఖరీదైన అలంకరణల మధ్య జరిగిన ఈ చిన్న సంఘటనే ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
‘ఇదీ అసలైన ప్రేమ’.. నెటిజన్ల ప్రశంసలు
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @mithila.manthan అనే పేజీ షేర్ చేసింది. అక్కడి నుంచి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ వైరల్‌గా మారింది. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే మనుషులకు ఈ వీడియో ప్రత్యేకంగా కనెక్ట్ అవుతోంది.
గ్రామీణ భారతదేశంలో పశువులు కేవలం జీవనోపాధికి మాత్రమే పరిమితం కావు. వ్యవసాయం, పాడి పరిశ్రమతో పాటు కుటుంబ జీవితంలోనూ వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వాటిని చిన్నప్పటి నుంచి పెంచుకునే వారిలో వాటిపై సహజంగానే అనుబంధం ఏర్పడుతుంది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజైన పెళ్లిలోనూ వాటిని భాగం చేసుకోవడం ద్వారా ఈ వరుడు తన ప్రేమను చాటుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఖరీదైన పెళ్లిళ్ల మధ్య.. మనసును తాకిన సంఘటన!
ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పెళ్లిళ్లలో ఖరీదైన కార్లు, దుస్తులు, అలంకరణల ప్రదర్శనకు బదులుగా ఇలాంటి ఆప్యాయతతో కూడిన క్షణాలు కనిపిస్తే ఎంత బాగుంటుందంటూ కొందరు స్పందిస్తున్నారు.
మరికొందరు మూగజీవాల పట్ల చూపించే ప్రేమను ప్రశంసిస్తున్నారు. మనుషులతో ఏర్పడే సంబంధాలకే కాకుండా, మాటలు మాట్లాడలేని జీవులతో పంచుకునే అనుబంధానికి కూడా విలువ ఉంటుందని ఈ సంఘటన గుర్తుచేస్తోందని అంటున్నారు.
కొన్ని బంధాలకు మాటలు అవసరం లేదు.. మనసులో చోటు ఉంటే చాలు. పెళ్లి మండపంలో తన గేదెలకు చోటిచ్చిన ఈ వరుడి వీడియో అందిస్తున్న సందేశం ఇదే.








