లిటిల్ హార్ట్స్ సక్సెస్ తర్వాత మౌళికి బెదిరింపులు
యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్న మౌళి తనూజ్ ప్రశాంత్(Mouli thanuj prasanth)కు లిటిల్ హార్ట్స్(Little hearts) సినిమా మంచి సక్సెస్ ను అందించింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా రిలీజైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్‌గా నిలవడంతో మౌళికి మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఈ సినిమా సక్సెస్‌తో ఆనందంగా ఉండాల్సిన టైమ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజాగా ఆయన బయటపెట్టారు. దొంగ నా కొడుకు(Donga na koduku) టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన మౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
లిటిల్ హార్ట్స్ రిలీజైన తర్వాత తనపై అసూయ, ద్వేషం పెరిగాయని మౌళి వెల్లడించారు. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలంటూ తనను ఆహ్వానించారని, అయితే అనారోగ్యంగా ఉండటంతో సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. ఈ డెసిషన్ తో తన ఫ్యూచర్ సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతాయని వార్నింగ్ తో పాటూ ఇన్‌డైరెక్ట్ గా బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ టైమ్ లో ఏం చేయాలో తెలియక భయపడిపోయానని, చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కార్యక్రమానికి హాజరయ్యానని వివరించారు.
ఇవి కూడా చదవండి
ఇండస్ట్రీలో ఎదగాలనే టార్గెట్ తో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని మౌళి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎదురైన అన్ని విషయాలను ప్రస్తుతం బయటపెట్టలేనని పేర్కొన్న మౌళి, బెదిరింపులకు భయపడేలా చేయాలనుకున్న వారి ప్రయత్నం కొంతవరకు ఫలించిందని అంగీకరించారు. అయినప్పటికీ కెరీర్లో ముందుకు వెళ్లాలంటే ఇలాంటి అనుభవాలను భరిస్తూనే ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. లిటిల్ హార్ట్స్ సక్సెస్ తో గుర్తింపు పొందిన మౌళి చేసిన ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో కొత్తగా ఎదుగుతున్న వారికి ఎదురయ్యే సవాళ్లపై మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.








