వర్కింగ్ ప్రెసిడెంట్ల పంచాయితీ తేలేనా?
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పులు, పదవుల భర్తీ ప్రక్రియ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది. అయినా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇంకా ఖాళీగానే ఉండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇది పార్టీలో అంతర్గత పరిణామాలకు అద్దం పడుతోంది.
ఒకవైపు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ల అవసరం ఉందా అనే వాదన కొందరు నేతల నుంచి వినిపిస్తోంది. మరోవైపు ఆశావహుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. ఈ పదవుల రేసులో చామల వంశీచంద్ రెడ్డి, ఎన్. పద్మావతి రెడ్డి, సి. రోహిణ్ రెడ్డి, నైనీ రాజేందర్ రెడ్డి, ఫహీమ్ ఖురేషి, ఎస్.ఏ. సంపత్ కుమార్, ఎస్. ఇందిర, ప్రీతం నగిరిగారి, బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, అజ్మతుల్లా హుస్సేనీ, ఎస్. ఒబైదుల్లా కోత్వాల్, ఎం.సునీతా రావు వంటి సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే నియామకాల్లో జాప్యం జరుగుతుండటంతో వీరిలో చాలామంది తమ వ్యూహాలను మార్చుకున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులపై స్పష్టత కరవుకావడంతో, ఆశావహులంతా ఇప్పుడు తమ చూపును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు, నామినేటెడ్ పదవుల వైపు మళ్లించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా పద్మశాలి వర్గానికి ఒక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కేటాయించనుండటంతో ఆ వర్గంలో తీవ్ర పోటీ నెలకొంది. ఎర్రవత్రి అనిల్, సంగిశెట్టి జగదీశ్వర్ రావు, పున్నా కైలాష్ నేత, జక్కని అనితతో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్రా వాణి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ఇక మిగిలిన రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పోటీ తీవ్రమైంది. బీసీ కోటాలో నీలం మధు, నేరెళ్ల శారద, ఎం. సునీతా రావు, సాతు మల్లేశం, చనగాని దయాకర్, లోకేష్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, గౌరి సతీష్ రేసులో ఉన్నారు. ఎస్సీ వర్గం నుంచి ప్రీతం నగిరిగారి, ఎస్.ఏ. సంపత్ కుమార్, ఎస్. ఇందిర, దొమ్మాట సాంబయ్య పేర్లు వినిపిస్తుండగా, ఎస్టీ కేటగిరీలో బెల్లయ్య నాయక్ ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీకి అందించిన సేవలను బట్టి హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు.. ఈ జాప్యానికి రాష్ట్ర నాయకత్వానికి, అప్పట్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు మధ్య ఉన్న అభిప్రాయభేదాలే కారణమని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, సెప్టెంబర్ 18న ఆమె ఉన్నత విద్య కోసం లండన్‌కు వెళ్లినప్పటికీ, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామక ప్రక్రియ మాత్రం ముందుకు పడలేదు. నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీల ఎంపిక పూర్తయిన తర్వాతే ఈ పదవులపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తానికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే నియామకాలుంటాయని పదే పదే హామీ ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆశావహులను అయోమయానికి గురిచేస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల ఆశను వదులుకుని నేతలు ప్రత్యామ్నాయ మార్గాలైన ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టడం కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవుల భర్తీ ఎప్పుడు కొలిక్కి వస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది.








