రివ్యూ: భావోద్వేగాలు, ఉత్కంఠ కలగలిసిన కుటుంబ కథా చిత్రం ‘321’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్
నటీనటులు: మోహిత్ పెదడ, లావణ్య సాహుకార, వివాన్ సూర్య, లక్ష్మీ వెన్నెల తదితరులు
సంగీతం: కాల్విన్ జాయ్
నిర్మాత: రామానుజ రెడ్డి
దర్శకత్వం: శాంతి కుమార్ చిలుముల
విడుదల తేదీ: 23.10.2026
నిడివి :2 ఘంటల 34 నిముషాలు
టైటిల్ 1 2 3 కాదు ఆసక్తికరమైన రివర్స్ టైటిల్ ‘3 2 1’ ‘ప్రేమ వివాహం vs పెద్దలు కుదిర్చిన పెళ్లి’ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం ‘321’. ‘అటు అమెరికా ఇటు ఇండియా’, ‘ఆత్రేయ’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నంది అవార్డు గ్రహీత శాంతి కుమార్ చిలుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రామానుజ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం, రొటీన్ మాస్ మసాలాలు, తీవ్ర రక్తపాతం, అసభ్యత, హింస, ద్వంద్వార్థ సంభాషణలు వంటి టెన్షన్ కు గురి చేసే చిత్రాల నుంచి విముక్తి కోరుకునే కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించిన అర్థవంతమైన, స్వచ్ఛమైన కుటుంభ కథాంశంతో వచ్చిన ‘321’ అక్టోబర్ 23, 2026న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఏ స్తాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ :
వివాహం పట్ల పూర్తి భిన్నమైన ఆలోచనలున్న ఇద్దరు వ్యక్తుల చుట్టూ అల్లిన కథ ఇది. అభి (మోహిత్ పెదడ) జీవితాంతం తోడుగా ఉండే బంధానికి ప్రేమ వివాహమే సరైన మార్గమని బలంగా నమ్మే ఆధునిక యువకుడు. మరోవైపు శృతి (లావణ్య సాహుకార) మాత్రం గత చేదు అనుభవాల కారణంగా పెద్దలు కుదిర్చిన వివాహం తర్వాతే నిజమైన ప్రేమ పుడుతుందని విశ్వసిస్తుంది. అభి తండ్రి పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని పట్టుబడితే, శృతి తల్లి ఎవరినీ ప్రేమించవద్దని కచ్చితమైన షరతు పెట్టి ఆమెను నగరానికి పంపుతుంది. విధివశాత్తూ అభి, శృతి ఒకే ఆఫీసులో కొలీగ్స్‌గా కలుస్తారు. శృతిని చూడగానే అభి ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో తన స్నేహితురాలికి సాయం చేసిన అభిని శృతి ఇష్టపడినప్పటికీ, తన భావాలను వ్యక్తపరచకుండా దాచుకుంటుంది. అదే సమయంలో గతంలో పెళ్లి చూపుల్లో చూసిన రాధ మళ్లీ అభి జీవితంలోకి ప్రవేశించడం, మరోవైపు లయ(లక్ష్మీ వెన్నెల) అనే గుర్తుతెలియని యువతి నుంచి అభికి నిరంతరం రహస్య ఫోన్ కాల్స్ రావడం కథను సంక్లిష్టంగా మారుస్తాయి. ఈ భావోద్వేగ సంఘర్షణ, సస్పెన్స్ నడుమ అభి చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? లయ వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? ఇంతకీ వాళ్ళు చేసుకున్నది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
నటీనటుల హవబవాలు :
నటీనటులందరూ సహజమైన అభినయంతో సినిమాకు ప్రాణం పోశారు మోహిత్ పెదడ తనదైన చలాకీతనం, చక్కటి కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో చక్కటి పరిణతి కనబరిచాడు. లావణ్య సాహుకార మనసులో బాధను దాచుకుంటూ కెరీర్‌పై దృష్టి సారించే హుందాతనమైన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. వివాన్ సూర్య, లక్ష్మీ వెన్నెల: తమ పరిధి మేరకు సపోర్టింగ్ రోల్స్‌లో ఆకట్టుకుంటూ కథాగమనానికి బలాన్ని చేకూర్చారు. కొందరు నటీనటులకు టెలివిజన్ నేపథ్యం ఉన్నప్పటికీ, లౌడ్ యాక్టింగ్ లేకుండా వెండితెరకు తగినట్లుగా తమ హావభావాలు, చక్కటి సంభాషణలతో మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు :
నంది అవార్డు గ్రహీత దర్శకుడు శాంతి కుమార్ చిలుముల బలవంతపు కమర్షియల్ హంగులు లేదా అసభ్యకర కామెడీ జోలికి పోకుండా, మానవ సంబంధాల సున్నితత్వాన్ని తెరపై ఆవిష్కరించడంలో తన మార్కు నిజాయితీని చాటుకున్నారు. సంగీత దర్శకుడు కాల్విన్ జాయ్ అందించిన పాటలు గ్రామీణ, పట్టణ వాతావరణాలకు తగ్గట్లుగా శ్రావ్యంగా ఉన్నాయి. అలాగే ఉత్కంఠభరిత సన్నివేశాల్లో నేపథ్య సంగీతం సన్నివేశాల స్థాయిని పెంచింది. సినిమాటోగ్రాఫర్ శివ ముప్పాల మెట్రో వాతావరణాన్ని, మధ్యతరగతి గృహాలను, నగర జీవనాన్ని సహజ సిద్ధమైన ఫ్రేమింగ్‌తో ఆహ్లాదకరంగా చూపించారు . కథ విస్తృతి పరిమితంగా ఉండటం మరియు ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాల నిడివి కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది ఎడిటర్ శివ సర్వాణి కీ కాస్త పనుంది. ప్రేమ, కుటుంబ సన్నివేశాల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్ డ్రామాను తలపించడం. థ్రిల్లర్ ఎలిమెంట్ బాగున్నప్పటికీ, ప్రారంభంలో వచ్చే ఆఫీస్ సన్నివేశాల స్క్రీన్‌ప్లేను మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే ఆసక్తి మరింత పెరిగేది. బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా హుందాగా ఉన్నాయి.
విశ్లేషణ:
‘321’ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఒక సాధారణ గృహ కథాంశం వెనుక దాగి ఉన్న తాత్విక లోతు. ప్రేమ పెళ్లా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా ఏది గొప్ప అనే వివాదంలోకి వెళ్లకుండా భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, గౌరవం, పరిణతి ఉన్నప్పుడే నిజమైన దాంపత్య ఆనందం సాధ్యమవుతుందని ఈ చిత్రం స్పష్టం చేస్తుంది. “మూడు ముళ్లు, రెండు మనసులు, ఒకే జీవితం” అనే అంతరార్థాన్ని సున్నితంగా ఆవిష్కరించారు. చిన్న చిన్న కారణాలతో బ్రేకప్‌లు, విడాకులు తీసుకునే నేటి తరం యువతకు కనువిప్పు కలిగించేలా ఉండటంతో పాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచించాలని సాంప్రదాయ పెద్దలకు సున్నితంగా సూచిస్తుంది. ఒకవైపు కుటుంబ అనుబంధాలు, మరోవైపు సీట్-ఎడ్జ్ సస్పెన్స్ మేళవించి దర్శకుడు చివరి నిమిషం వరకు ప్రేక్షకులను కథలో లీనం చేయగలిగారు. ‘321’ అనేది మనసుకు హాయినిచ్చే ఒక చక్కటి, స్వచ్ఛమైన కుటుంబ వినోదాత్మక చిత్రం. నిజ జీవితంలో కనిపించే బంధాల సంఘర్షణలు, కదిలించే భావోద్వేగాలు, ఆసక్తికరమైన ఉత్కంఠతో సాగే ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడొచ్చు. విలువలతో కూడిన, అర్థవంతమైన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘321’ ఒక చక్కటి సినిమా అవుతుంది.








