ఏపీ జడ్పీ ఎన్నికల్లో వారసుల హవా.. సీనియర్ నేతలకు కొత్త టెన్షన్..
ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ ఎన్నికలు రాజకీయ వారసులకు వేదికగా మారుతున్నాయి. భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎదగాలని ఆశిస్తున్న పలువురు నేతల కుటుంబ సభ్యులు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టిన నాయకులు తమ కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అధికార కూటమి పార్టీల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుండటంతో, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని భవిష్యత్తు రాజకీయాలకు పునాదిగా భావిస్తున్న పలువురు నేతలు తమ కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైసీపీలోనూ పలువురు నాయకుల వారసులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పార్టీ ఉనికిని కాపాడుకోవడం, స్థానికంగా తమ బలాన్ని నిలబెట్టుకోవడం కూడా ఈ పోటీ వెనుక కారణాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఉత్తరాంధ్రలోని విజయనగరం (Vizianagaram) జిల్లాలో జడ్పీ అధ్యక్ష పదవిపై ఆసక్తికరమైన పోటీ కనిపిస్తోంది. సీనియర్ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు (Kimidi Kala Venkata Rao) కోడలితోపాటు, మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళ నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి బొత్స కుటుంబ సభ్యులు కూడా నామినేషన్లు వేయడంతో పోటీపై ఉత్కంఠ నెలకొంది.
అనకాపల్లి (Anakapalli) జిల్లాలోనూ కుటుంబ రాజకీయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు భార్య అరుణ, కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ భార్య సత్యవతి, జనసేన నేత సుందరపు సతీష్ భార్య జడ్పీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కుమార్తె తేజశ్వి కూడా నామినేషన్ వేశారు.
గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొల్లపల్లి అమూల్య పోటీలో ఉండగా, కాకినాడలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేరు తెరపైకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట్, ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్య, మాజీ ఎంపీ మాగంటి బాబు సతీమణి పద్మావతి పోటీకి సిద్ధమయ్యారు.
రాయలసీమలోనూ వారసుల సందడి పెరిగింది. సత్యసాయి జిల్లాలో పరిటాల శ్రీరామ్, నంద్యాల జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి, కర్నూలులో కేఈ ప్రభాకర్ కుమారుడు రుద్రఫణి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పరిణామాలతో పార్టీ కోసం చాలాకాలంగా పనిచేస్తున్న నాయకుల్లో తమకు అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన నెలకొంది. కొత్త పదవులు వస్తాయని ఆశించిన వారికి కుటుంబ రాజకీయాలు అడ్డంకిగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతలు తమ జిల్లాల్లో రాజకీయ పట్టు నిలబెట్టుకోవడానికి వారసులను ముందుకు తీసుకొస్తుండగా, మరికొందరు భవిష్యత్తులో మంత్రి పదవులు పొందేందుకు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో ఉన్నారని చర్చ సాగుతోంది. అయితే చివరకు ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆయా పార్టీల అధిష్టానాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.








