Global Summit: రేవంత్ రెడ్డి ‘గ్లోబల్’ వ్యూహాలు!
తెలంగాణలో పారిశ్రామిక విప్లవానికి తెరలేపేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. డిసెంబర్ 7 నుండి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న రెండో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ను విజయవంతం చేయడమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ డెలిగేట్లకోసం ఢిల్లీలో ప్రత్యేక విందు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదిప్పుడు ఆసక్తి రేపుతోంది.
ఈ నెల 29న ఢిల్లీలో వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారులను తెలంగాణకు ఆకర్షించడమే కాకుండా, రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలను వివరించనున్నారు. అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, యూఏఈ వంటి దేశాల నుంచి భారీ పెట్టుబడులను రాబట్టడమే ధ్యేయంగా ఈ సన్నాహాలు జరుగుతున్నాయి. సింగిల్ విండో అనుమతుల ద్వారా విదేశీ కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి స్వయంగా భరోసా ఇవ్వనున్నారు.
ఈ విందు సమావేశం కేవలం వ్యాపార, పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదు. దీని వెనుక బలమైన వ్యూహం కూడా ఉంది. సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న ‘డిఫెన్స్ ఎక్స్పో’లో పెద్ద ఎత్తున ఎయిర్ షో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ, రాజకీయాలకు అతీతంగా పెట్టుబడులను సాధించేందుకు రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ ఇన్వెస్టర్ల ముందు ప్రధానంగా ప్రదర్శించనున్నారు. ఐటీ, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, బయోటెక్, ఫార్మా, విద్య వంటి రంగాల్లో ఉన్న అవకాశాలపై TGIIC, పరిశ్రమల శాఖ ఇప్పటికే ఒక బ్లూప్రింట్‌ను సిద్ధం చేశాయి. కర్ణాటకలో ఇప్పటికే ఒక రోడ్‌షో విజయవంతం కాగా, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా నవంబర్‌లో ఇలాంటి సన్నాహక సదస్సులు నిర్వహించనున్నారు.
అయితే.. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన సమ్మిట్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, కేవలం అవగాహన ఒప్పందాలకే పరిమితం కాకుండా వాటిని గ్రౌండింగ్ చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా మార్చాలనే సంకల్పంతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్లో జరిగే ఈ మహా సమ్మిట్ విజయవంతం అయితే, అది రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు, నాయకత్వ పటిమకు మరో మైలురాయిగా నిలవనుంది.








